42 రోజుల తర్వాత మంత్రివర్గ విస్తరణ | - | Sakshi
Sakshi News home page

42 రోజుల తర్వాత మంత్రివర్గ విస్తరణ

Jun 18 2026 1:29 AM | Updated on Jun 18 2026 1:29 AM

ముగ్గురు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం! పుదుచ్చేరిలో పూర్తి స్థాయి కేబినెట్‌ కొలువు త్వరలోనే శాఖల కేటాయింపు: సీఎం రంగస్వామి

సాక్షి, చైన్నె: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎట్టకేలకు 42 రోజుల తర్వాత మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. కొత్తగా ఎంపికై న ముగ్గురు మంత్రులు బుధవారం పాత రాజ్‌ నివాస్‌లో ప్రమాణ స్వీకారం చేశారు.దీంతో పూర్తి స్థాయి కెబినెట్‌ కొలువైంది. మంత్రులకు త్వరలోనే శాఖలను కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి రంగసామి ఈ సందర్భంగా ప్రకటించారు.

నిరీక్షణకు తెర

ఇటీవల జరిగిన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 30 స్థానాలకు గాను ఎన్డీయే 18 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని కై వసం చేసుకుంది. గత నెల 13వ తేదీన కూటమి పెద్ద ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత రంగసామి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటుగా బీజేపీకి చెందిన నమశ్శివాయం, ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌కు చెందిన మల్లాడి కృష్ణారావు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత గత నెల 18న తాత్కాలిక స్పీకర్‌గా అన్బళగన్‌ ఎంపిక జరగ్గా, 20న ఎమ్మెల్యేలందరూ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మంత్రివర్గ విస్తరణ మాత్రం బ్రేక్‌ పడింది. పుదుచ్చేరిలో ఐదుగురు మంత్రులుగా కొనసాగాల్సి ఉంది. నాన్చుడు ధోరణితో సాగిన ఈ వ్యవహారం ఎట్టకేలకు ఎన్నికల ఫలితాలు వచ్చిన 42 రోజుల తర్వాత బుధవారం అధికారికంగా విస్తరణకు నోచుకుంది.

రాష్ట్రపతి ఆమోదంతో ముందుకు..

మంత్రివర్గ విస్తరణ కోసం బీజేపీ నుంచి జి.ఎన్‌.ఎస్‌. రాజశేఖర్‌, ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ నుంచి శివకొలుందు, రాజవేలు పేర్లను సిఫార్సు చేస్తూ సీఎం రంగసామి ఈ నెల 3వ తేదీన లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కై లాష్‌నాథన్‌కు లేఖ పంపించారు. కేంద్ర హోం శాఖ ద్వారా ఇది రాష్ట్రపతి ఆమోదానికి వెళ్లగా, ఈ నెల 8వ తేదీన రాష్ట్రపతి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో భారతి పార్క్‌ సమీపంలోని పాత లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నివాసంలో బుధవారం ఉదయం ముగ్గురు మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కై లాష్‌నాథన్‌ కొత్త మంత్రుల చేత పదవీ ప్రమాణ స్వీకారం, రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మంత్రులంతా అసెంబ్లీకి చేరుకుని తమ తమ ఛాంబర్లలో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీఎం రంగసామి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమమే ధ్యేయం: సీఎం

ఇప్పటివరకు ప్రమాణ స్వీకారం చేసిన ఏ మంత్రికి కూడా శాఖల కేటాయింపు జరగలేదు. ప్రస్తుతం అన్ని శాఖలను ముఖ్యమంత్రే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ విషయంగా మంత్రుల బాధ్యతల స్వీకారం అనంతరం సీఎం రంగసామి మీడియాతో మాట్లాడుతూ.. పుదుచ్చేరిలో మంత్రివర్గ విస్తరణ విజయవంతంగా పూర్తయింది. మంత్రులందరూ బాధ్యతలు స్వీకరించి పనిచేయనున్నారు. ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమిస్తుందన్నారు. త్వరలోనే మంత్రులకు శాఖలు కేటాయిస్తామని, అలాగే అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నిక తేదీని కూడా త్వరలోనే ప్రకటిస్తామన్నారు. స్పీకర్‌ పదవిని బీజేపీకి ఇస్తారా లేదా అనేది ప్రశ్నించగా, ఆ సమయం వచ్చినప్పుడు తెలుస్తుందని అని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement