సాక్షి, చైన్నె : మహిళల భద్రతను మరింత కట్టుదిట్టం చేసే దిశగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘సింగపెన్ స్పెషల్ ఫోర్స్’ ప్రపథమంగా సేలం నగరంలో గురువారం నుంచి తన కార్యకలాపాలను ప్రారంభించింది. మహిళా పోలీసులు నేతృత్వం వహించే ఈ ప్రత్యేక దళం, జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే గస్తీని మొదలుపెట్టింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మహిళల రక్షణ కోసం ప్రత్యేక ఫోర్స్ ఏర్పాటు చేస్తానని విజయ్ ఇచ్చిన హామీ మేరకు, రాష్ట్రంలోనే మొదటిసారిగా సేలం నగర పోలీసు విభాగంలో ఈ విభాగం ప్రారంభమైంది.
సింగపెన్ ప్రత్యేక దళం
సేలం సిటీ పోలీస్ కమిషనర్ అనిల్ కుమార్ గిరి పర్యవేక్షణలో, సూరమంగళం రేంజ్ అసిస్టెంట్ కమిషనర్ రమలి రామలక్ష్మి ఈ దళాన్ని పర్యవేక్షిస్తారు.ఈ బృందంలో ఒక ఎస్.ఐ (అరుళ్‌మొళి), ఇద్దరు ఎస్.ఎస్.ఐలు, , మహిళా హెడ్ కానిస్టేబుల్స్ సభ్యులుగా ఉన్నారు. కేవలం వాహన డ్రైవర్ మాత్రమే మగ పోలీసు ఉన్నారు. ఈ దళానికి ప్రత్యేక వాహనం, బాడీ వోర్న్ కెమెరాలు, ఇతర భద్రతా పరికరాలను ప్రభుత్వం సమకూర్చింది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విద్యా సంస్థలు ఐటీ కంపెనీల వంటి మహిళలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిరంతరం గస్తీ నిర్వహించడం ఈ బృందం విధులు. మహిళలపై జరిగే అక్రమ చర్యలను అరికట్టడం , ఫిర్యాదు అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని తగిన చర్యలు తీసుకోవడం కూడా. సామాజిక సంక్షేమ , విద్యా శాఖలతో కలిసి మహిళా భద్రతపై అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. బాధితులకు తక్షణ సహాయం అందేలా ప్రభుత్వం , స్వచ్ఛంద సంస్థలతో సమన్వయం చేసుకోవడంలో ఈ బృందం నిమగ్నం అవుతుంది. ఈ దళాన్ని ప్రారంభించిన సందర్భంగా కమిషనర్ అనిల్ కుమార్ గిరి మాట్లాడుతూ.. మహిళలు తమ సమస్యలపై ఫిర్యాదు చేసినా లేదా అత్యవసర నంబర్‌కు కాల్ చేసినా, సింగపెన్ దళం వెంటనే స్పందించి వారికి అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.


