సాక్షి,చైన్నె: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన రాజకీయ వ్యవహారాల ప్రత్యేక అధికారిగా వ్యక్తిగత జ్యోతిష్కుడు రిక్కీ రతన్ పండిట్ వెట్రివేల్‌ను నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం అధికారిక ప్రకటన విడుదలైంది. వివరాలు.. ముఖ్యమంత్రి విజయ్‌కు అత్యంత సన్నిహితుడైన రిక్కీ రతన్ పండిట్‌ను ప్రభుత్వ ప్రత్యేక అధికారిగా నియమిస్తూ మంగలశారం జీవో జారీ అయింది. ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఈ నియామకం అమలులోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఒక జ్యోతిష్కుడిని ప్రభుత్వ పరిపాలనా విభాగంలో కీలక పదవిలో నియమించడంపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ నియామకాన్ని ప్రధాన ప్రతిపక్షం డీఎంకేతో పాటు, ప్రభుత్వానికి బయటి నుండి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్, వీసీకే, సీపీఐ, సీపీఎం పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అసెంబ్లీలోడీఎండీకే తీవ్ర స్థాయిలో విరుచుకు పడింది. సామాజిక మాధ్యమాలలో సైతం విజయ్‌కు వ్యతిరేకంగా సైటెర్లు వేసే వారు పెరిగారు.
తగ్గిన ప్రభుత్వం
ప్రతి పక్షాలు, అసెంబ్లీలో మిత్రుల నుంచి సైతం వ్యతిరేకత రావడంతో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ, రతన్ పండిట్ నియామక ఉత్తర్వులను తక్షణమే రద్దు చేస్తున్నట్లు విజయ్ ప్రభుత్వం ప్రకటించింది.
నీట్ రద్దుకు పట్టు
నీట్ రద్దు చేయా లని తమిళనా డులోని పలు రాజకీయ పార్టీల నాయకులు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అలాగే నీట్ రద్దు చేయాలని, ప్లస్–2 మార్కుల ఆధారంగానే వైద్య విద్య ప్రవేశాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం విజయ్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ’నీట్’ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై సీఎం విజయ్ తీవ్రంగా స్పందించారు. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విమర్శిస్తూ, నీట్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రశ్నపత్రం లీకేజీ కారణంగా ఈ పరీక్షను రద్దు చేయడం లక్షలాది మంది వైద్య విద్యార్థుల ఆశలను అడియాశలు చేసిందని విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. 2024లో కూడా ఇలాగే ప్రశ్నపత్రం లీకై సీబీఐ విచారణ జరిగిందని ఆయన గుర్తు చేశారు. నీట్ పరీక్ష వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారు, తమిళ మీడియం విద్యార్థులు, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని నీట్ వ్యవహారంలో నిర్లక్ష్యం వహించకుండా రద్దు నిర్ణయం తీసుకోవాలన్నారు.


