తిరువొత్తియూరు: తమిళనాడు, సేలం జిల్లాలో మొదటి వివాహాన్ని దాచిపెట్టి రెండో పెళ్లి చేసుకున్న యువతి, ఆమెకు సహకరించిన మరో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సేలం జిల్లా తలైవాసల్ సమీపంలోని సార్వాయి గ్రామానికి చెందిన ఆనందన్ (37) అనే రైతుకు, విరుదునగర్ జిల్లాకు చెందిన కనక(28) అనే యువతితో గతేడాది సెప్టెంబర్‌లో వివాహం జరిగింది. పెళ్లయిన వారం రోజులకే కనక చైన్నెలో పని చేసిన చోట తన పాత గదిని ఖాళీ చేస్తానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. ఆనందన్ ఆరా తీయగా, ఆమెకు ఇదివరకే కేరళకు చెందిన వ్యక్తితో వివాహం జరిగిందని తెలిసింది. పెళ్లిళ్ల బ్రోకర్లు రూ.2.50 లక్షలు తీసుకుని తనను మోసం చేశారని ఆనందన్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కనక, ఆమె తల్లి కుప్పులక్ష్మి, పెళ్లిళ్ల బ్రోకర్లు పళని, లత, జ్యోతి, పెరియసామి సహా మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తిరువళ్లూరు: ఈకాడు కండ్రిగ గ్రామంలో ప్రభుత్వానికి చెందిన స్థలాన్ని అక్రమించుకుని వాటికి నకిలీ పట్టా పొంది లేఅవుట్‌గా మార్చేస్తున్నారని ఇదే అంశంపై పలుసార్లు కలెక్టర్‌తో సహా పలువురు ఉన్నత అధికారులకు వినతి పత్రం సమర్పించినా ఫలితం లేదని ఆరోపిస్తూ గ్రామస్తులు సోమవారం ఉదయం రాస్తారోకో నిర్వహించారు. తిరువళ్లూరు యూనియన్‌లో ఈకాడు, చిన్న ఈకాడు, ఈకాడు కండ్రిగ తదితర గ్రామాలున్నాయి. ఈ మూడు గ్రామాల పరిధిలో ప్రభుత్వానికి చెందిన స్థలం ఉంది. సంబంధిత స్థలాన్ని కొందరు ఆక్రమించుకుని లేఅవుట్‌లుగా మార్చుతున్నారని ఆరోపిస్తూ, చర్యలు తీసుకోవాలని పలుసార్లు కలెక్టర్‌తో సహా పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకోక పోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు తిరుపతి–చైన్నె జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి వారితో చర్చలు జరిపి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. రాస్తారోకోతో దాదాపు 30 నిమిషాలపాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
తిరువొత్తియూరు: కృష్ణగిరి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బెంగళూరు నుంచి కేరళకు వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ప్రయాణిస్తున్న కారు టైరు పంక్చర్ అయ్యింది. కృష్ణగిరి జాతీయ రహదారిపై కారు టైరు మార్చుతుండగా, వెనుక నుంచి వచ్చిన కంటైనర్ లారీ కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నావికాదళంలో పని చేస్తున్న దీపక్(28), అతని సోదరి దివ్య (30) అక్కడికక్కడే మరణించారు. కారులో ఉన్న మరో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం కృష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నాచెల్లెళ్లు మరణించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.
తిరువొత్తియూరు: తమిళనాడు పాడి పరిశ్రమ ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.జయపాలన్ విడుదల చేసిన ప్రకటనలో ఈ క్రింది విధంగా పేర్కొన్నారు. శాసనసభ ఎన్నికలలో 108 నియోజకవర్గాల్లో ఘనవిజయం సాధించి, అతిపెద్ద పార్టీగా అవతరించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్‌కు తమ సంఘం తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. 54 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన తమిళనాడు పాడిపరిశ్రమ ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సంఘం తరఫున ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు, ప్రశంసలు తెలియజేస్తున్నామని తెలిపారు.
తిరువొత్తియూరు: చైన్నె, ఈకాట్టుతాంగల్, ధనకోటి రాజా వీధిలో ఒక ప్రముఖ ప్రైవేట్ సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ సర్వీస్ సెంటర్ (రిపేర్ సెంటర్) ఉంది. ఇక్కడ భారీ సంఖ్యలో మోటార్ సైకిళ్లను నిలిపి ఉంచారు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి అక్కడున్న మోటార్ సైకిళ్లు అకస్మాత్తుగా నిప్పు అంటుకుని మంటలు చెలరేగాయి. కొద్దిసేపట్లోనే మంటలు వేగంగా వ్యాపించి అనేక బైక్‌లకు అంటుకున్నాయి. దీనివల్ల ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. సమాచారం అందుకున్న గిండి పోలీసులు, గిండి, అశోక్ నగర్, సైదాపేట మరియు విరుగంబాక్కం నుండి అగ్నిమాపక వాహనాలతో ఘటనాస్థలికి చేరుకున్నారు. సుమారు గంటన్నరపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయినప్పటికీ అక్కడ నిలిపి ఉంచిన 175 మోటార్ సైకిళ్లు ఈ అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయి.షార్ట్ సర్క్యూట్ (విద్యుత్ లీకేజీ) కారణంగా ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో గిండి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.


