తమిళసినిమా: ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగానే ఉంటుంది. అలాంటి మనోభావననే దర్శకుడు విగ్నేష్ శివన్ వ్యక్తం చేశారు. నటి నమనతార భర్త అయిన ఈయన తాజాగా తెరకెక్కించిన చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఎల్‌ఐకే). నటుడు ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి జంటగా నటించిన ఇందులో నటుడు ఎస్‌జే.సూర్య ప్రతినాయకుడిగా, సీమాన్ కీలక పాత్రలోనూ నటించారు. నయనతారకు చెందిన రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియో సంస్థ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించారు. కాగా ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇంతకు ముందు ప్రదీప్ రంగనాథన్ నటించిన చిత్రాలన్నీ రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరాయి. ఈ చిత్రం కూడా అంత విజయాన్ని సాధిస్తుందని యూనిట్ సభ్యులు భావించారు. అయితే ఎల్‌ఐకే చిత్రం రూ. 100 కోట్ల క్లబ్ దరిదాపులకు రాలేదు. ఇప్పుడీ చిత్రం అమెజాన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంపై స్పంధించిన దర్శకుడు విష్నేష్ శివన్ నేను ఒక కలతో వచ్చాను. అది చిన్నది కాదు, సేప్ అయినదీ కాదు. నమ్మకం అనే తుఫాన్. ఈ చిత్ర కథ కోట్ల సంఖ్యలో ప్రకాశిస్తుందనీ, థియేటర్లలో అదురుతుందనే నమ్మకమే. ప్రేక్షకుల చప్పట్ల ధ్వని మారుమోగుతుందని భావించాను. అయితే దాన్ని థియేటర్లలో చూశానని, నవ్వించగలిగాను. అయినప్పటికీ ఇంకా చిత్రం రూ. 100 కోట్ల క్లబ్‌లోకి చేరలేదు. నిజం చెప్పాలంటే అంతకంటే రెండు రెట్లు వసుళ్లూ సాధిస్తుందని భావించాను. అయితే ఏదో సరిగా అమరలేదు. చివరి ఫలితం బాధ కలిగించినా, నేను సంతోషంగా, సంతృప్తిగానే ఉన్నాను. ఎందుకంటే ముందు చెప్పినట్లుగానే ఈ చిత్రం విడుదలవ్వడమే పెద్ద బ్లాక్‌బ్టస్టర్. ప్రశంసలు కంటే విమర్శలే ఎక్కువగా వచ్చినా, నేను ఇంకా నిలబడే ఉన్నాను. ఈ చిత్రం వెనుక ఎవరూ చూడని పలు అవాంతరాలు ఉన్నాయి. అయినా నిజాయితీని, శ్రమను సంపాదించి పెట్టింది ఈ చిత్రం అని దర్శకుడు విగ్నేష్ శివన్ పేర్కొన్నారు.


