బీజేపీలో కొత్త సెగ.. కనీస గుర్తింపు కరువు | - | Sakshi
Sakshi News home page

కనీస గుర్తింపు కరువు: శరత్‌కుమార్‌ ఆవేదన

Mar 23 2026 8:34 AM | Updated on Mar 23 2026 3:56 PM

-

సాక్షి, చైన్నె: ప్రముఖ నటుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు ఆర్‌. శరత్‌ కుమార్‌ తన రాజకీయ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను నమ్మి పార్టీలో చేరిన వారికి, తనకు సరైన గుర్తింపు దక్కడం లేదని ఆయన బహిరంగంగానే తన ఆవేదనను వ్యక్తం చేశారు. చైన్నెలో ఆదివారం తన మద్దతుదారులతో అత్యవసరంగా సమావేశమైన శరత్‌ కుమార్‌, అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను బీజేపీలో చేరినప్పుడు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే, ఇప్పటివరకు ఎలాంటి పదవీ కేటాయించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి బాధ్యత లేకపోతే కార్యకర్తలతో కలిసి ఎలా పని చేయగలను? అని ప్రశ్నించారు.

విలీనంపై విచారం..
తన సొంత పార్టీ అఖిల భారత సమత్వ మక్కల్‌ కట్చిని బీజేపీలో విలీనం చేయకుండా ఉంటేనే బాగుండేదని తన మద్దతుదారులు భావిస్తున్నారని తెలిపారు. ఈ నిర్ణయం తీసుకుని పెద్ద తప్పే చేశామన్నారు. పార్టీలో చేర్చుకుని వేచి చూడమనడం సరైన పద్ధతి కాదన్నారు. తన ఆవేదనను వివరిస్తూ జాతీయ నాయకత్వానికి, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్‌ నాగేంద్రన్‌కు లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. తాను అసంతృప్తితో లేనని, కేవలం ఆవేదనతో ఉన్నానని వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల్లో పోటీ చేయను
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో తాను గానీ, తన భార్య రాధిక గానీ పోటీ చేయమని శరత్‌ కుమార్‌ స్పష్టం చేశారు. అధిష్టానం చెప్పినా సరే పోటీ చేసే ఉద్దేశం లేదన్నారు. అయితే తనతో పాటూ నడిచిన సమర్థులైన నాయకులకు అవకాశం ఇవ్వాలని ఓ జాబితాను అందజేసినట్లు చెప్పారు. నటుడు విజయ్‌ ప్రారంభించిన తమిళగ వెట్రి కళగం గురించి మాట్లాడుతూ, విజయ్‌ని ఒక నాయకుడిగా తాను పరిగణించడం లేదన్నారు. ఆయనపై తనకు ఎలాంటి అంచనాలు లేవని వ్యాఖ్యానించారు. 

తిరుచ్చిలో జరిగిన బీజేపీ సదస్సులో తన ఫొటో కూడా వేయకపోవడంపై తన మద్దతుదారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, కనీసం ఇప్పటికై నా పార్టీ గుర్తించాలని ఆయన కోరారు. ప్రస్తుతానికి పార్టీని వీడే ఆలోచన లేదని చెబుతూనే, బాధ్యతలు ఇస్తేనే పనిచేయడం సాధ్యమని పరోక్షంగా బీజేపీ అఽధిష్టానాన్ని హెచ్చరించడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement