23న మధురాంతకంలో మోదీ సభ
– ఏర్పాట్లు ప్రారంభం
సాక్షి, చైన్నె: ప్రధాని నరేంద్ర మోదీ సభ కోసం రాష్ట్ర బీజేపీ వర్గాలు ఏర్పాట్లు మొదలెట్టాయి. చెంగల్పట్టు తదుపరి ఉన్న మధురాంతకాన్ని వేదికగా ఎంపిక చేశారు. ఇక్కడ బుధవారం ప్రత్యేక పూజలతో పనులకు శ్రీకారం చుట్టారు. అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమిలో బీజేపీ ఉన్న విషయం తెలిసిందే. వివరాలు.. అన్బుమణి పీఎంకే సైతం ఇటీవల కూటమిలో చేరింది. మరిన్ని పార్టీలు కూటమిలోకి వస్తాయని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. ఈ మేరకు చర్చలు జరుగుతూ వస్తున్నాయి. ఈ పరిస్థితులలో కూటమి పార్టీల నేతలందర్నీ ఒకే వేదిక పైకి తెచ్చే విధంగా ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో బహిరంగ సభకు బీజేపీ వర్గాలు కసరత్తులుచేపట్టాయి. ఈనెల 23వ తేదీన ప్రధాని తమిళ నాడు పర్యటనకు వస్తుండటంతో మహాబలిపురం లేదా పూందమల్లి సమీపంలో బహిరంగ సభకు వేదిక ఎంపిక కసరత్తులు మొదలెట్టారు. అయితే చెంగల్పట్టు తదుపరి మధురాంతకంలో బ్రహ్మాండ వేదికను ఎంపిక చేశారు. ఇక్కడ ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. ఉదయం చెంగల్పట్టు జిల్లా పార్టీ నేతృత్వంలో జరిగిన పూజలతో పనులకు శ్రీకారం చుట్టారు. ఈ వేదికపై నుంచి అన్నాడీఎంకే కూటమి, ఎన్‌డీఏ కూటమి పార్టీల నేతలను పీఎం మోదీ పరిచయం చేయనున్నారు. ఆ తదుపరి ఎన్నికల పనులను అన్ని పార్టీలు సమష్టిగా ముందుకు తీసుకెళ్లనున్నాయి. ఇదిలా ఉండగా ఢిల్లీ వేదికగా బుధవారం కేంద్ర సహాయమంత్రి ఎల్. మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్‌వేడుకకు ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. తమిళనాడు నుంచి పార్టీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, మాజీ గవర్నర్ తమిళసైసౌందరరాజన్, సినీ నటులు శరత్‌కుమార్, శివకార్తికేయన్, రవి మోహన్, గాయని కెనీషా తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.
మోదీ


