టూరిస్ట్ ఈవీ బస్సు ప్రారంభం
కొరుక్కుపేట: ముఖ్యమంత్రి స్టాలిన్ శ్రీకారం చుట్టిన డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ (ఈవీ) బస్సు మొదటి సర్వీస్‌ను చైన్నెలోని వల్లజా రోడ్ కాంప్లెక్స్‌లో పర్యాటక శాఖ డైరెక్టర్, ఎండీ క్రీస్తురాజ్ బుధవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించే రీతిలో డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తాయని తెలిపారు. పర్యాటకాన్ని పెంపొందించే లక్ష్యంతో, అమెరికాలోని తమిళులు , అశోక్ లేలాండ్ లిమిటెడ్ సంయుక్తంగా రూ. 1.89 కోట్ల వ్యయంతో ఈ ఆధునిక డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా ఇచ్చారని వెల్లడించారు. హిందూజా ఫౌండేషన్ ఈ బస్సును ముఖ్యమంత్రికి అందజేసిందన్నారు. ముఖ్యంగా పాఠశాల విద్యార్థుల కోసం అందుబాటులోకి తెచ్చారని వివరించారు. ఈ క్రమంలోనే కెల్లీస్ కోసపెట్ ప్రభుత్వ పాఠశాల బాలికలు, రాయపురం స్కూలు బాలురతోపాటు మొత్తం 54 మంది విద్యార్థులను సాంస్కృతిక పర్యటనకు తీసుకెళ్లినట్టు తెలిపారు.అనంతరం చైన్నెలో నిర్వహిస్తున్న 50వ ఇండియా టూరిజం , ఇండస్ట్రీ ఎగ్జిబిషన్‌కు విద్యార్థులను ఈ బస్సులో తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు.


