రాహుల్‌తో ఎంపీ రాజా భేటీ
సాక్షి, చైన్నె : ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభ ప్రతి పక్ష నేత రాహుల్ గాంధీతో డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ఎ. రాజా ప్రత్యేకంగా భేటీ కావడం ప్రాధాన్యతకు దారి తీసింది. ఇటీవల కాలంగా కాంగ్రెస్ వర్గాలు చేస్తూ వస్తున్న వ్యాఖ్యలు కూటమిలో చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. సీట్ల పందేరం, అధికారంలో వాటా అంటూ చేస్తూ వస్తున్న వ్యాఖ్యలను డిఎంకే వర్గాలు నిశితంగా పరిశీలిస్తూ వస్తున్నాయి. అదే సమయంలో ఎవ్వరూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయ వద్దని టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై కాంగ్రెస్ వర్గాలను హెచ్చరించారు. ఈ పరిస్థితులలో నీలగిరి జిల్లా కూడలూరు పర్యటనకు మంగళవారం రాహుల్ గాంధీ వచ్చిన విషయం తెలిసిందే. తిరుగు ప్రయాణంలో కోయంబత్తూరులో రాహుల్ గాంధీతో ఎ. రాజా ప్రత్యేకంగా భేటీ కావడం గమనార్హం. కాంగ్రెస్ వర్గాల రూపంలో రాష్ట్రంలో సాగుతున్న చర్చలు తదితర అంశాలను ఆయనకు రాజా వివరించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. సీఎం, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఆదేశాల మేరకు రాహుల్‌తో రాజా ప్రత్యేకంగా భేటీ అయ్యారన్న చర్చ ఊపందుకుంది.
మోడీ, అమిత్ షా వచ్చినా ఒరిగేదేమీ లేదు..!
– డీఎంకేపై ఎవరూ ఒత్తిడి తీసుకురాలేరు
కొరుక్కుపేట: డీఎంకేపై ఎవరు ఎప్పుడు ఒత్తిడి తీసుకురాలేరని మోడీ, అమిత్ షా బీజేపీకి ఒరిగేదేమీ ఉండదని మంత్రి రఘుపతి అభిప్రాయపడ్డారు. పుదుక్కోట్టైలో విలేకరులతో మంత్రి మాట్లాడుతూ తమిళనాడులో ద్రావిడులు కలిసి వచ్చారు. అందుకే మేం ద్రావిడ పొంగల్ జరుపుకుంటున్నాం. డీఎంకే పార్టీని ఎవ్వరూ ఏమీ చేయలేరని మరోసారి అధికారంలోకి డీఎంకే ప్రభుత్వమే వస్తుందన్నారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలో ఉన్నప్పుడు తమిళనాడుకు ఎలాంటి నిధులు రావడం లేదని.. యూపీఏ పాలనలోనే తమిళనాడు రోడ్లు, మురుగునీటి శుద్ధి కర్మాగారాలు, ఫ్లైఓవర్లు వంటి వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు వచ్చాయన్నారు.
24వ తేదీతో ముగియనున్న ఇంటర్వ్యూలు
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకేలో ఎన్నికలలో పోటీ చేయడానికి ఉత్సాహంగా ఉన్న ఆశావహులకు ఇంటర్వ్యూలపై ఆపార్టీ ప్రధాన కార్యదర్శి పళని స్వామి దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఐదు రోజుల పాటూ ఇంటర్వ్యూలు నిరంతరాయంగా నిర్వహిస్తూ వస్తున్నారు. 234అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను సుమారు 10 వేలమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాల వారీగా ఆశావహులను పిలిపించి పళణి మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితులలో బుధవారం చైన్నె, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాలలోని ఆశావహులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఆయా ఆశావహుల పనితీరు, వారికి ఉన్న అర్హతలను గురించి అడిగి తెలుసుకన్నారు. ఇక ఈనెల 24వ తేదీన విల్లుపురం, తిరువణ్ణామలై తదితర జిల్లాలలోని ఆశావహులను ఇంటర్వ్యూల తదుపరి ఈ ప్రకియను ముగించనున్నారు.
నదిలో దూకి విద్యార్థిని ఆత్మహత్య
తిరువొత్తియూరు : చైన్నెకి సమీపం పెరుంగళత్తూరుకు చెందిన ధనంజయ్ కుమార్తె యువశ్రీ (25) మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు.. చైన్నె అన్నా యూనివర్సిటీలో యువశ్రీ ఎంబీఏ సెకండియర్ చదువుతోంది. ఈ క్రమంలో మెరీనా కామరాజర్ రోడ్డులోని నేపియర్ వంతెనపై ఆమె నడిచి వెళుతూ హఠాత్తుగా కూవం నదిలోకి దూకింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి చూడగా అక్కడ ఒక బ్యాగ్ పడి ఉంది. అందులో ఐడీ కార్డు, ఒక లెటర్ ఉంది. ’నాకు బతకాలని లేదు. నా చావుకు ఎవరూ కారణం కాదు. నా తల్లిదండ్రులు, సోదరి నన్ను క్షమించండి’ అని రాసి ఉంది. ఈ క్రమంలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి పడవ ద్వారా మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు యువశ్రీ మృతదేహం మెరీనా బీచ్‌లో తీరానికి కొట్టుకువచ్చింది. పోలీసులు వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. యువశ్రీ ఆత్మహత్యకు కారణాలను అన్వేషిస్తున్నారు. విద్యార్థిని తల్లిదండ్రులు, మిత్రులను విచారిస్తున్నారు. ఫోన్, వాట్సాప్ డేటాను విశ్లేషిస్తున్నారు.
టీటీడీకి రూ.10 లక్షల విరాళం
తిరుమల: చైన్నెకు చెందిన ధర లాజిస్టిక్స్ సంస్థ బుధవారం వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా తిరుమలలోని టీటీడీ అదనపు ఈఓ క్యాంపు కార్యాలయంలో అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.


