రేపు తిరువళ్లువర్ డే వేడుకలు
సాక్షి, చైన్నె : వళ్లువర్ కోట్టం వేదికగా ఈసారి తిరువళ్లువర్ డే వేడుకలు జరగనున్నాయి. ఇందులో అవార్డుల ప్రదానోత్సవం చేయనున్నారు. తమిళాభివృద్ధి, సమాచార శాఖ నేతృత్వంలో ఇటీవల వళ్లువర్ కోట్టంను బ్రహ్మాండంగా, సుందరంగా తీర్చిదిద్దిన విషయం తెలిసిందే. దశాబ్దకాలం తర్వాత వళ్లువర్ కోట్టంలో తిరువళ్లువర్ డే వేడుకకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఈనెల 16వ తేదీన ఉదయం 8.30 గంటలకు తమిళ మహాకవి తిరువళ్లువర్ విగ్రహం వద్ద నివాళులర్పించే కార్యక్రమం జరగనుంది. ఇందులో తమిళ సంస్కృతి, సంప్రదాయం, భాషా పరిరక్షణలో రాణిస్తున్న వారికి గాను అవార్డులు, బిరుదలను ప్రదానం చేయనున్నారు. 2025 సంవత్సరానికి గాను డీఎంకే ప్రధాన కార్యదర్శి, మంత్రి దురై మురుగన్‌కు అన్నాదురై అవార్డును, సత్యవేల్ మురుగనార్‌కు తిరువళ్లువర్ అవార్డును, పెరియార్ అవార్డు అరుల్‌మొళికి, సిందనై సెల్వన్‌కు అంబేడ్కర్ అవార్డును, ఇదయ తుల్లాకు కర్మయోగి కామరాజర్ అవార్డును, మహాకవి భారతియార్ అవార్డును నెల్‌లై జయంతకు, పావేందర్ భారతీ దాసన్ అవార్డును యుగ భారతికి, తమిళ్ తెండ్రల్ తిరు వికా అవార్డును ఇరై అన్భుకు, అలాగే ముగ్గురు పోలీసు అధికారులకు కేఏపీ విశ్వనాథ్ అవార్డు, ముగ్గురు పరిశోధకులకు కలైంజ్ఞర్ అవార్డును ప్రదానం చేయనున్నారు. అలాగే, పొంగల్(సంక్రాంతి) పండుగ సందర్భంగా 2026 సంవత్సరానికి గాను పోలీసులకు పతకాలను సీఎం స్టాలిన్ ప్రకటించారు. తమిళనాడులోని పోలీస్, ఫైర్ అండ్ రెస్క్యూ, జైళ్లు తదితర విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు విధి నిర్వహణలో పనితీరుకు గుర్తింపుగా పొంగల్ సందర్భంగా పతకాలను ప్రకటించారు.


