ముత్తయ్య దర్శకత్వంలో అరుణ్‌విజయ్
తమిళసినిమా: ఇంతకుముందు కొంభన్, విరుమాన్ వంటి పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ముత్తయ్య తన తర్వాత చిత్రానికి సిద్ధం అవుతున్నారు. గ్రామీణ కథా చిత్రాన్ని తెరకెక్కించి విజయం సాధించడంలో సిద్ధహస్తుడు అయిన ఈయన తాజాగా అరుణ్‌విజయ్ హీరోగా చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈవిషయాన్ని అరుణ్ విజయ్ ఇటీవల అధికారికంగా వెల్లడించారు. కథానాయకుడు, ప్రతినాయకుడు ఇలా పాత్ర ఏదైనా నటించడానికి వెనకాడని అరుణ్‌విజయ్. ఈయన ఇటివల ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఇడ్లీకడై చిత్రంలో విలన్‌గా నటించి అదరగొట్టారు. ఆ తరువాత రెట్టతలై చిత్రంలో కథానాయకుడిగా ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రం ఇటీవలే విడుదలై విజయం సాధించింది. ఈయన తాజాగా తన నూతన చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ముత్తయ్య దర్శకత్వంలో నటించనున్న ఈ చిత్రం షూటింగ్ మార్చి నెలలో సెట్‌పైకి వెళ్లనుందని అరుణ్ విజయ్ చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.


