ఇది సమాచార యుగం
సాక్షి, చైన్నె: ఇది సమాచార యుగం అని, అన్ని సమాచారాలు సులభంగానే లభిస్తాయని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. నీలగిరి జిల్లా కూడలూరులో విద్యార్థులతో కలసి మంగళవారం తన ఆనందాన్ని పంచుకున్నారు. నీలగిరి జిల్లా కూడలూరులోని సెయింట్ థామస్ పాఠశాల స్వర్ణోత్సవం జరిగింది. కార్యక్రమానికి రాహుల్ హాజరయ్యారు. ఆయనతోపాటు డీఎంకే ఎంపీ రాజా, కాంగ్రెస్ నేతలు గిరిశీ చోదన్కర్, సెల్వపెరుంతొగై హాజరయ్యారు. నీలగిరుల్లోని గిరిజన సంప్రదాయం మేరకు ఆయనకు ఆహ్వానం లభించింది. అందరితో కలసి ఆయన సైతం నృత్యం చేశారు. ఓవైపు వర్షం పడుతున్నా, మరో వైపు విద్యార్థులతో కలసి సంక్రాంతి వేడుకలో పాల్గొన్నారు. పొంగళి తయారీలో నిమగ్నమయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇది సమాచార యుగం అని, అన్ని సులభంగానే లభిస్తాయన్నారు. అయితే, సమాచారాన్ని తెలివిగా ఆలోచించకుండా అంగీకరిస్తే దిగజారిపోతామని వ్యాఖ్యానించారు. యువ విద్యార్థులను తెలివైన పిల్లలుగా మార్చడం పాఠశాల కర్తవ్యం అని సూచించారు. సమాచార జ్ఞానాన్ని మార్చగల సామర్థ్యం ఉన్న విద్యార్థులను అభివృద్ధి చేయాలన్నారు. పిల్లలు ఇష్టమైన గురువు ఎవరు అని ప్రశ్నిస్తే చాలు చటుక్కున నచ్చిన, మెచ్చిన గురువు పేరును చెప్పే విధగా ఉండాలని సూచించారు. వర్షంలో విద్యార్థులను కూర్చోపెట్టినందుకు క్షమించాలని కోరుతూ, యువ విద్యార్థులను తెలివైన విద్యార్థులుగా మారుద్దామని, ప్రేమతో నిండిన భారతదేశాన్ని సృష్టిస్తామని వ్యాఖ్యలు చేశారు. ప్రజలను ఏకధాటిగా తీసుకురావడానికి తన పోరాటం అని పేర్కొంటూ, విద్య ఖరీదైనది కాకూడదన్నారు. మెరుగైన విద్య ప్రభుత్వ బాధ్యత అన్నారు. విద్యా వ్యవస్థ మాత్రమే కాదు ,తయారీ విదానంపై దృక్పథం మారాలన్నారు. సేవా రంగంలో బాగా రాణిస్తున్నప్పటికీ చైనా వలే తయారీ రంగంపై మరింత దృష్టి పెట్టలేకపోతున్నామన్నారు. చేతి వృత్తిదారులను ప్రోత్సహించాలని కోరారు. పాలకుల కారణంగా ప్రజాస్వామ్య నిర్మాణంలో బీటలు పడ్డాయని, ఇది పాలకుల ద్వారా దాడికి గురవుతుందన్నారు.
ఇది సమాచార యుగం


