హోంగార్డులుగా హిజ్రాలు
సాక్షి, చైన్నె: హోంగార్డులుగా హిజ్రాలను నియమిస్తూ సీఎం స్టాలిన్ చర్యలు తీసుకున్నారు. 50 మందికి ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేశారు. సచివాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమాలకు సీఎం స్టాలిన్ హాజరయ్యారు. తమిళనాడు పోలీసు విభాగం నేతృత్వంలో హోంగార్డుల ఎంపికలో 50 మంది ిహిజ్రాలకు అవకాశం కల్పించారు.వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఇందులో ఏడుగురికి సీఎం స్టాలిన్ స్వయంగా ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేశారు. వీరిలో చైన్నెలో ఐదుగురు, తాంబరంలో 15 మంది, ఆవడిలో 10 మంది, మదురై, కోయంబత్తూరులలో తలా ఏడు మంది , తిరుచ్చిలో ఆరుగురిని నియమించారు. రద్దీ సమయాలలో ట్రాఫిక్ నియంత్రణకు హోంగార్డు సేవలను వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, మంత్రి పి. గీతా జీవన్, ప్రధాన కార్యదర్శి ఎన్. మురుగానందం, హోం శాఖ కార్యదర్శి ధీరజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కార్మిక సంక్షేమం మరియు నైపుణ్యాభివృద్ది విభాగం ద్వారా ప్రైవేటు సంస్థలలో ఉపాధి కల్పనకు చర్యలు తీసుకున్నారు. ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు అందించే లక్ష్యంతో సాగుతున్న ఈ ప్రక్రియలో లక్ష్యాన్ని 3 లక్షలకు చేర్చారు. ఇప్పటి వరకు 2,99,000 మందికి నియామక ఉత్తర్వులు ఇవ్వగా, తాజాగా చివరి వ్యక్తిగా 3,00,000కి ఉద్యోగ నియామకం అందజేశారు. అలాగే, మరో పది మందిని ఎంపిక చేసి నియామక ఉత్తర్వులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఉదయ నిధి, మంత్రి సీవీ గణేషన్, సీఎస్ మురుగానందం, కార్మిక సంక్షేమం శాఖ కార్యదర్శి, వీర రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.
రూ. 2 వేలు కానుక
తమిళనాడు పాల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య తరపున రూ. 80.62 కోట్ల వ్యయంతో పూర్తయిన 8 ప్రాజెక్టులను సీఎం స్టాలిన్ వీడియో కాన్పరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు అన్బిల్ మహేశ్, మనో తంగరాజ్, తదితరులు హాజరయ్యారు. అలాగే తమిళనాడు గిడ్డంగుల విధానం 2026, తమిళనాడు సర్యులర్ ఎకానమి ఇన్వెస్ట్‌మెంట్ పాలసీని సీఎం స్టాలిన్ విడుదల చేశారు. కార్యక్రమానికి మంత్రి టీఆర్‌పీ రాజా హాజరయ్యారు. హిందూ మత ధార్మిక దేవాదాయ శాఖ పరిపాలనా నియంత్రణలో ఉన్న దేవాలయాలలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు , వారి కుటుంబ పెన్షనర్లకు సంక్రాంతి కానుకగా రూ. 2 వేలు నగదు పంపిణీని ప్రారంభించారు. ముందుగా కలైంజ్ఞర్ శత జయంతి స్మారక ఉద్యానవనంలో జరిగిన కార్యక్రమంలో సంక్రాంతి సందర్భంగా రైతు సంఘాల నేతలతో సీఎం సమావేశమయ్యారు. వారికి పండుగ శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా, అందరి అభిప్రాయాలను స్వీకరించారు. సలహాలు, సూచనలు విన్నారు. రైతు సంక్షేమాన్ని కాంక్షించే విధంగా నాలుగున్నరేళ్ల కాలంలో తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పథకాలు, ప్రాజెక్టులను ఈ సందర్భంగా సీఎం వివరించారు.
హోంగార్డులుగా హిజ్రాలు


