కీల్పాకం మర్డర్ కేసులో ఆరుగురి అరెస్టు
సాక్షి, చైన్నె: చైన్నె కీల్పాకం ఆస్పత్రిలో రౌడీ హత్య కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరికి కాళ్లు విరిగాయి. వివరాలు.. చైన్నె కీల్పాకం ఆస్పత్రి కొళత్తూరుకు చెందిన రౌడీ ఆది(20) సోమవారం వేకువ జామున దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇది పాత కక్షల నేపథ్యంలో జరిగిన హత్యగా పోలీసులు తేల్చారు. తొమ్మిది బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం వేట మొదలెట్టారు. ఈ కేసులో రౌడీ ఆది ప్రియేసి ఆవడిలోని సుచిత్ర(21), ఆమె బంధువు మది(21)కి సంబంధం ఉందని పోలీసులు తేల్చారు. ఈ ఇద్దరి వద్ద జరిపిన విచారణలో కొళత్తూరులో 2022లో జరిగిన రౌడీ విక్కీ హత్యకు ప్రతీకారంగానే ఆదిని మట్టు బెట్టినట్టు విచారణలో తేలింది. కేసు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు మంగళవారం కొళత్తూరుకు చెందిన సూర్య(18) , కార్తీక్ రాజా(18), ఫరూక్ అలీ(19), వనకుమార్(19), రామ్ (21), జయప్రతాప్(21)లను అరెస్టు చేశారు. ఇందులో వనకుమార్, జయప్రతాప్‌లకు కాళ్లు విరిగాయి. పట్టుకునే క్రమంలో జారిపడడంతో కాళ్లు విరగడంతో కట్టుకట్టించినట్టు పోలీసులు పేర్కొన్నారు. కాగా భద్రతతో కూడిన ఆస్పత్రి ఆవరణలో జరిగిన ఈ ఘటనను పోలీసు యంత్రాంగం తీవ్రంగా పరిగణించింది. ఇక్కడ విధులలో ఉన్న ఇన్‌స్పెక్టర్లకు వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు. అలాగే, భద్రతా విధులలో ఉన్న నలుగుర్ని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.


