ఐక్యతే మన బలం
● ప్రపంచానికి తమిళనాడు వైభవాన్ని చాటుదాం ● భాష గల్లంతైన పక్షంలో జాతి పతనమైనట్టేనని హెచ్చరిక ● ముగిసిన ప్రవాస తమిళ దినోత్సవం ● అవార్డుల ప్రదానం ● రోడ్డెక్కిన డబుల్ డెక్కర్
సాక్షి, చైన్నె: నందంబాక్కం వర్తక కేంద్రం వేదికగా జరిగిన ప్రవాస తమిళ దినోత్సవ వేడుక సోమవారం ముగిసింది. ఈసందర్భాన్ని పురస్కరించుకుని అమెరికాలో నివసిస్తున్న తమిళుల తరపున అభివృద్ధి కోసం అందించిన డబుల్ డెక్కర్ ఏసీ బస్సు సేవలను జెండా ఊపి సీఎం స్టాలిన్ ప్రారంభించారు. ప్రవాస తమిళులు, అశోక్ లేలాండ్‌లు రూ. 1.89 కోట్ల వ్యయంతో డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ రైలును తీర్చిదిద్దింది. ముంబైలోని హిందూజా ఫౌండేషన్ తమిళనాడు ప్రభుత్వానికి విరాళంగా అందజేసింది. తమిళనాడు పర్యాటక అభివృద్ధి సంస్థ(టీటీడీసీ)కి దీనిని అప్పగించారు. వారసత్వం, సంస్కృతిని చాటే విధంగా ఈ బస్సు సేవ పర్యాటక ప్రయోజనాల కోసం అందించారు. ఈ బస్సులోని సౌకర్యాలను సీఎం స్టాలిన్ పరిశీలించారు. ఇది పూర్తిగా పర్యాటక అనుకూలంగా అందరికీ ప్రయోజనం చేకూర్చే రీతిలో తీర్చిదిద్దారు.టీటీడీసీ ప్రధాన కార్యాలయం నుంచి స్పెన్సర్ ప్లాజా, మక్కా మసీదు, వాచ్ టవర్,పల్లవన్ రోడ్డు, బాడీ గాడ్ మునీశ్వర ఆలయం, రాజా అన్నామలై మండ్రం, హైకోర్టు, సెక్రటరియేట్, రిజర్వు బ్యాక్, హార్బర్, వార్ మెమోరియల్, నేప్పియర్ వంతెన, మెరీనా, నేతల సమాధాల స్క్వయర్, లైట్ హౌస్, పట్టినంబాక్కం బీచ్, శాంతోమ్, ఆల్ ఇండియా రేడియా, డీజీపీ కార్యాలయం, క్వీన్ మెరీస్ కళాశాల, వివేకానంద హౌస్, ప్రెసిడెన్సీ కళాశాల, ఎళిలగమ్, చైన్నెవర్సిటీ, దూరదర్శన్ కేంద్రం, రాజాజీ మాల్, ఓమందూరార్ ఎస్టేట్‌లను కలుపుతూ సేవలను అందించనుంది. అనంతరం జరిగినముగింపు వేడుకలో తమిళం కోసం విశిష్ట సేవలు అందిస్తున్న వారిని అవార్డులతో సీఎం స్టాలిన్ సత్కరించారు. కార్యక్రమంలో మంత్రులు ఆర్ రాజేంద్రన్, నాజర్, టీఆర్‌పీ రాజా, సీఎస్ మురుగానందం, అదనపు కార్యదర్శిమణివాసన్, తదితరులు హాజరయ్యారు.
తమిళుల సంక్షేమమే లక్ష్యం
ఈ కార్యక్రమంలో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, తాను ఓ సీఎంగా కాకుండా, సోదరుడిగా ప్రవాస తమిళులందర్నీ ఆహ్వానిస్తూ, అభినందిస్తున్నట్టు వివరించారు. దేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ మూలన ఉన్నా, అందరం ఒకే కుటుంబం అని వ్యాఖ్యాలు చేశారు. తమిళం అన్నది వేల సంవత్సరాల వారసత్వం అని దేశాలు, సముద్రాలు , భూ భాగాలు విడదీసినా భాష అన్నది తమిళ జాతి భావోగ్వేనికి ప్రతీకగా వ్యాఖ్యలు చేశారు. విదేశాలలో జీవించి ఉన్నప్పటికీ, తమిళనాడును ఎప్పటికీ, ఎన్నడూ మరిచి పోని వారే తమిళులు అని వివరించారు. తమిళులు ఎక్కడంతా ఉంటారో, అక్కడ వారికి అన్ని రకాల అండగా ద్రావిడ మోడల్ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. అందుకే 15 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఉన్నామని గుర్తు చేశారు. తమిళం ద్వారా ఏకం అయ్యేందుకు విజయాలను సాధించేందుకు ఈ వేడుకను ప్రతి ఏటా వేదికగా చేసుకుని నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. తమిళనాడులోని 105 శిబిరాల్లో నివసిస్తున్న ఈలం తమిళుల కోసం 7,469 ఇళ్లను నిర్మించాలని ప్రణాళిక రూపొందించామన్నారు. విదేశాల్లోని తమిళుల కోసం టోల్–ఫ్రీ హెల్ప్‌లైన్ ప్రారంభించామని పేర్కొన్నారు. తమిళ మూలాల అన్వేషణలో ప్రయాణం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
డబుల్ డెక్కర్ బస్సుకు జెండా ఊపుతున్న సీఎం స్టాలిన్
తమిళ ప్రవాసులు తమ స్వస్థలాలను మెరుగు పరచుకునేందుకు నా గ్రామం ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేస్తున్నామని గుర్తు చేస్తూ, మరింతగా ఎన్‌ఐఆర్‌లు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. తమిళనాడులోనే కాకుండా విదేశాలలో కూడా తమిళ భాష అభివృద్ధి కోసం అనేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని ప్రకటించారు. విదేశాలలోని తమిళుల సంగమం కోసం శ్రమిస్తున్న తమిళ యువకుడికి ఉత్తమ సాంస్కృతిక రాయబారి అవార్డులను అందిస్తున్నామన్నారు. తమిళులు ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, వారు ఆనందంగా జీవించాలని , అంతే కాదు, ఐక్యతతో ముందుడుగు వేయాలని పిలుపున ఇచ్చారు. శ్రీలంకలో ప్రవేశపెడుతున్న కొత్త రాజ్యాంగంలోని అంశాలు అక్కడ నివసిస్తున్న తమిళ బంధువుల హక్కులపై ప్రభావితం అవుతున్న సమాచారంతో.. తక్షణం కేంద్ర ప్రభుత్వం ద్వారా శ్రీలంకపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలను విస్తృతం చేశామన్నారు. తమిళనాడు భవిష్యత్తును తమిళనాడు ప్రజలు, వారి కలల ద్వారా రూపొందించే విధంగా 2030 విజన్‌కు సిద్ధమయ్యామన్నారు. ప్రపంచ భాషలకు తమిళం యజమాని అని పేర్కొంటూ, కుల మత భేదాలను అధిగమించి, అందర్నీ ఏకంచేసే శక్తి ఒక్క తమిళ భాషకు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. తమిళ నేలలో ద్రావిడ ఉద్యమాన్ని గుర్తు చేస్తూ, భారత రాష్ట్రాలలో ఒక ప్రత్యేకమైన రాష్ట్రంగా తమిళనాడును పరిగణిస్తారని పేర్కొన్నారు. భాష కోసం పోరాడిన ఉద్యమం మాత్రమే కాదు, భాషా హక్కులను కాపాడుకోవడానికి జరిగిన ఉద్యమ త్యాగాలను ఎన్నడూ మరి పోరాదని వ్యాఖ్యలు చేశారు. భాష నాశనమైతే జాతి నాశనమవుతుందని, జాతి నాశనమైతే మన సంస్కృతి నాశనం అవుతుందని, సంస్కతి నాశనం అయితే, మన గుర్తింపు నాశనం అవుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని సూచించారు. గుర్తింపు అన్నది పరిరక్షించుకోవాలని, గౌరవాన్ని నిలబెట్టుకోవాలని పిలుపు నిచ్చారు. తమిళులు ఎక్కడ నివసించినా, జీవించినా, ఐక్యతతో ముందుకు సాగాలని, . తమిళనాడు వైభవాన్ని ప్రపంచ దేశాలలోకి తీసుకెళ్లాలని కోరారు. కాగా ఈ కార్యక్రమంలో విదేశాలలో ప్లేస్ మెంట్ సేవలను అందించేందుకు వీలుగా ఓఎంసీఎల్, వీఐటీ మధ్య సీఎం స్టాలిన్ సమక్షంలో అవగాహన ఒప్పందం జరిగింది. ఇందులో వీఐటీ చాన్స్‌లర్ జీ విశ్వనాథన్, ఓఎంసీఎల్ చైర్మన్ కెయ బాలసుబ్రమణ్యం సంతకాలు చేశారు.
ఐక్యతే మన బలం
ఐక్యతే మన బలం
ఐక్యతే మన బలం


