ముగ్గురు ఎమ్మెల్యేలకు ఉద్వాసన
●రాందాసు నిర్ణయం
సాక్షి, చైన్నె : అన్బుమణితో కలిసి పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ముగ్గురు ఎమ్మెల్యేలకు ఉద్వాస పలుకుతూ పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు నిర్ణయం తీసుకున్నారు. పీఎంకేతో రాందాసు, అన్భుమణి మధ్య జరుగుతున్న సమరం గురించి తెలిసిందే. ఈ ఇద్దరు మద్దతు దారులు తలా ఓ శిబిరంగా వ్యవహరిస్తున్నారు. పీఎంకే తనదేనంటూ అన్బుమణి ప్రకటించుకుని రానున్న ఎన్నికలలో అన్నాడీఎంకేతో పొత్తును సైతం ఖరారు చేసుకున్నారు. అయితే, దీనిని పార్టీ వ్యవస్థాపకుడు రాందాసు తీవ్రంగా వ్యతిరేకిస్తూవస్తున్నారు. పీఎంకేకు సర్వం తానేనని, అన్ని అధికారాలు తనకే ఉన్నాయని ప్రకటించుకున్నారు. ఈ పరిస్థితులో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, అన్బుమణికి మద్దతుగా ఉన్న మైలం శివకుమార్, మైలం సదాశివం, ధర్మపురి వెంకటేశ్వరన్‌పై రాందాసు కన్నెర్ర చేశారు. ఈ ముగ్గుర్ని పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. కాగా, ఇప్పటికే పీఎంకేకు చెందిన రాందాసు మద్దతు దారులైన ఎమ్మెల్యేలు జీకేమణి, అరుల్‌పై అన్బుమణి శిబిరం కన్నెర్ర చేసిది. మొత్తంగా ఆ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉండగా, ఒకరిపై మరొకరు ఆధిప్యతం దిశగా సాగి అసెంబ్లీ సమావేశాలలో ప్రాతినిథ్యం అన్నది లేకుండా చేసుకుంటారేమో వేచిచూడాల్సిందే.
కమల్ పేరు, ఫొటో ఉపయోగించొద్దు!
హైకోర్టు ఆదేశాలు
సాక్షి, చైన్నె : నటుడు, మక్కల్ నీది మయ్యం నేత, రాజ్య సభ సభ్యుడు కమలహాసన్ పేరు, ఫొటోలను వాణిజ్య ఉపయోగాలకు వాడొద్దని మద్రాసు హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. వివరాలు.. చైన్నెకు చెందిన ఓ సంస్థ ఎలాంటి అనుమతి అన్నది పొందకుండా కమల్ ఫొటోలు, పేరును వాడేసుకుని టీషర్టులు, షర్టుల తయారీపై దృష్టి పెట్టింది. దీనిని వ్యతిరేకిస్తూ కమల్ తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కమల్ తరపున సోమవారం జరిగిన విచారణకు హాజరైన సీనియర్ న్యాయవాది సతీస్ పరాశరన్, న్యాయవాది విజయన్ సుబ్రమణియన్ తమ తరపు వాదన వినిపించారు. ఎలాంటి అనుమతి అన్నది పొందకుండా కమల్ ఫొటో, పేరును ఉపయోగిస్తున్నాని వివరించారు. వాదనల అనంతరం కమలహాసన్ పేరు, ఫొటోలను వాణిజ్యపరంగా ఉపయోగించకుండా మధ్యంతర స్టే విధిస్తూ కోర్టు ఉత్తర్వులుజారీ చేసింది. అలాగే పిటిషన్‌కు విరణ ఇవ్వాలని సంబంధిత సంస్థకు ఆదేశిస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరికి వాయిదా వేశారు.
1.86 కోట్ల కుటుంబాలకు పొంగల్ కానుకల పంపిణీ
కొరుక్కుపేట: తమిళనాడులో ఇప్పటివరకు 1.86 కోట్ల కుటుంబాలకు పొంగల్ కానుకలు ఒక్కొక్కరికి రూ. 3,000 నగదును పంపిణీ చేసినట్లు సహకార మంత్రి కె.ఆర్. పెరియ కరుప్పన్ తెలిపారు. తమిళ పండుగ పొంగల్ వేడుకలు జరుపుకోవడానికి, 2,22,91,710 బియ్యం కుటుంబ కార్డుదారులకు కుటుంబాలకు పొంగల్ బహుమతి సెట్లను అందిస్తున్నారు. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కిలో బియ్యం, ఒక కిలో చక్కెర , చెరుకు గడ అందించాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీనితో పాటూ ఆయన రూ. 3,000 నగదు బహుమతిని కూడా ప్రకటించారు. 8వ తేదీన సరసమైన ధరల దుకాణాలలో ధోతీ, చీరలను అందించే పథకాన్ని కూడా ఆయన ప్రారంభించారు. గతంలో దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్డుదారులకు సరసమైన ధరల దుకాణ సిబ్బంది టోకెన్లను అందించారు. దాదాపు 50,000 మంది సహకార రంగ కార్మికులు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. పొంగల్‌కు ముందు, రేషన్ కార్డు దారులకు రూ. 3,000 నగదు కనుక అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఆదివారం వరకు 24,924 దుకాణాల్లోని 1,86,23,426 కుటుంబ కార్డుదారులకు ఒక్కొక్కరికి రూ.3,000 చొప్పున రూ.5,587.02 కోట్లు పంపిణీ చేశారు. 1,39,06,292 ధోతీ, చీరలు కూడా అందజేసినట్లు తెలిపారు.
ముగ్గురు ఎమ్మెల్యేలకు ఉద్వాసన


