తమిళం అందర్నీ ఏకం చేసింది!
సాక్షి, చైన్నె : తమిళ సంక్షేమ శాఖ, పునరావాసం విభాగం, తమిళ ఇంటర్నెట్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ నేతృత్వంలో ప్రవాస తమిళుల దినోత్సవం – 2026 వేడుకలకు నందంబాక్కం వర్తక కేంద్రాన్ని వేదికగా ఎంపిక చేశారు. రెండురోజుల ఈ వేడుకను సీనియర్ మంత్రి దురై మురుగన్‌తో కలిసి డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ప్రారంభించారు. ఇక్కడ ప్రవాస తమిళుల ఘనతను చాటే విధంగా స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. వివిధ పోటీలలో విజేతలుగా నిలిచిన ప్రవాస తమిళ విద్యార్థులకు రూ. 10 లక్షలు విలువైన ఉపకరణలు, సర్టిఫికెట్లు, బహుమతులను అందజేశారు. మారిషస్ ఉప ముఖ్యమంత్రి మలయప్పన్ చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు.
ప్రయోజనాలే ముఖ్యం..
ప్రవాస తమిళుల ప్రయోజనాలను కాపాడుకోవడానికి వివిధ చర్యలు తీసుకుంటున్నామని వివరిస్తూ, తాజాగా మరిన్ని అంశాలతో ప్రణాళికలను రూపకల్పన చేశామన్నారు. ఉక్రెయిన్, ఇరాన్, ఇజ్రాయిల్ వంటి దేశాలలో యుద్ధం జరుగుతున్న సమయంలో అక్కడున్న తమిళులను రక్షించి, సురక్షితంగా మాతృభూమికి తీసుకు రావడంలో ప్రవాస తమిళుల పాత్ర అన్నది కీలకంగా మారిందని ప్రశంసించారు. విదేశాల్లో పనిచేస్తున్న తమిళులకు ఏదైనా సమస్య ఎదురైనపక్షంలో ఈ విభాగం ముందు వరసులో ఉంటున్నదన్నారు. విదేశాల్లో అనేక ఉన్నత శిఖరాలు సాధించిన తమిళులు ఎందరో ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నారని,ఈ సంఖ్య మరింతగా పెరగాలని పిలుపు నిచ్చారు. భారతదేశంలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రం జాబితాలో నంబర్–1 స్థానమే లక్ష్యంగా తమిళనాడు ఎదుగుతోందన్నారు. ఈ విజయంలో ప్రవాస తమిళుల పాత్ర చాలా గొప్పదని, అందరం కలిసి కట్టుగా ఈ నెంబర్ ఒన్‌ను సాధిద్దామని పిలుపునిచ్చారు. మన భాష, సంస్కృతి, సంప్రదాయాలను ఎక్కడున్నా సరే మరచి పోవద్దు అని, మూలాల అన్వేషనలో ప్రభుత్వం మరింత ముందుకు సాగుతున్నదని వివరించారు.
తమ తమ పిల్లలకు తమిళనాడు సంస్కృతి, చిహ్నాలు, చారిత్రాత్మక అంశాల గురించి తెలియజేడమే కాదు, స్వయంగా వచ్చి వీక్షించే విధంగా సూచనలు ఇవ్వాలని కోరారు. కలలను తమతో పంచుకుంటే చాలు, వాటిని సాకరం చేసే దిశగా బృహత్తర పథకాన్ని సైతం సీఎం స్టాలిన్ ప్రవేశ పెట్టారని గుర్తుచేస్తూ, ప్రవాస తమిళులు, వారి కుటుంబాలు ఇందులో భాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చారు. తమిళం ద్వారా అందరం ఐక్యంగా ఉందాం, హోదాలో ఎదుగుదాం అని ఈ సందర్భంగా అందరితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మంత్రులు అన్బరసన్, ఎస్‌ఎం నాజర్, ఎంపీలు వీరాస్వామి, సల్మా , ప్రవాస తమిళుల సంక్షేమ బోర్డు అధ్యక్షుడు కార్తికేయ శివ సేనాపతి, ప్రభుత్వ కార్యదర్శి రీటా హరీష్ థక్కర్, కెనడా, శ్రీలంక, మలేషియా, లండన్, దక్షిణాఫ్రికాకు చెందిన మంత్రులు, ప్రభుత్వ ప్రతినిధులు, ఎంపీలు జువానిత నాథన్, విఎస్‌రాధాకృష్ణన్, కమలనాథన్, సెంథిల్ తొండమాన్, జీవన్ త్యాగరాజా, దినకరన్, లోగనాథన్ (లోకీ), రాజన్ నటరాజన్, అరుణ్ శ్రీనివాసన్, విమల జెన్నింగ్స్ తో సహా విదేశాల్లోని తమిళులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
తమిళం అందర్నీ ఏకం చేసిందని ప్రవాస తమిళులను ఉద్దేశించి డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. చైన్నెలో ప్రవాస తమిళ దినోత్సవ వేడుకలను ఆదివారం నందంబాక్కం
ట్రేడ్ సెంటర్‌లో నిర్వహించారు.
బంధాలకు బలం..
ఈ వేడుకలో డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ మాట్లాడుతూ, తమిళనాడు ప్రభుత్వం తరపున నిర్వహిస్తున్న ప్రవాస తమిళుల దినోత్సవ మహానాడు ఎక్కడెక్కడో ఉన్న తమిళ బంధాలను ఏకం చేశాయని వివరించారు. దూరం పెరిగే కొద్దీ, సంబంధం, అనురాగం బలపడతాయని పెద్దలు చెబుతారని గుర్తు చేస్తూ, పలు దేశాలలో తమిళ భావాలతో, తమిళ ప్రేమతో నివశిస్తున్న వారంతా మాతృ రాష్ట్రంపై చూపుతున్న ప్రేమ వెలకట్ట లేనిదిగా పేర్కొన్నారు. ప్రవాస తమిళులు విదేశాలలో అనేక రకాల పండుగను జరుపుకుని ఉంటారని, అయితే మాతృభూమిలో తమిళ సంస్కృతి, సంప్రదాయాలకు స్ఫూర్తినిచ్చే విధంగా పొంగల్ వేడుకకు సన్నద్ధం కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అధికారంలోకి వచ్చినానంతరం ప్రవాస తమిళుల కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటుచేసి, ఏటా ప్రవాస తమిళ దినోత్సవాన్ని అత్యంత కోలాహలంగా నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. ఈ సంవత్సరం తమిళం ద్వారా అనుసంధానం, ఎదుగుదాం అన్న నినాదంతో వేడుకలను జరుపుకుంటున్నామన్నారు. తమిళ భాష అందరినీ కలిపే భాష. తమిళం ఎవరిపై వివక్ష చూపదు, వివక్ష లేదు, తేడా లేదన్న వ్యాఖ్యలు చేశారు. కులం, మతం, ధనిక, పేద, యజమాని, కార్మికుడు, పురుషుడు, సీ్త్ర అన్న తేడాలకుఅ తీతంగా అందర్నీ మాతృ భాష ఏకం చేస్తున్నదన్నారు. అందరం తమిళం మాట్లాడుతున్నామని గుర్తుచేస్తూ అందరి ఐక్యతతో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నామని, గొప్ప చరిత్రలను సృష్టించి ఉన్నామని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా తమిళులు సమన్వయంతో బంధాలను పదిలం చేసుకుంటున్నారన్నారు. తమిళనాడు నుండి ఇంజనీర్లు, వైద్యులు, పరిశోధకులుగా ఎందరో విదేశాలకు వెళ్లి వస్తున్నారని వివరించారు. నేడు ప్రవాస తమిళుల బోర్డులో 32 వేల మంది సభ్యులుగా ఉన్నారని గుర్తు చేస్తూ, వీరందరి కోసం ప్రత్యేక సంక్షేమ సహాయకాలను, తోడ్పాటును ద్రావిడ మోడల్ ప్రభుత్వం అందిస్తున్నట్టు వివరించారు.


