కంచే చేనుమేసింది..!
తిరువొత్తియూరు: ప్రజలకు న్యాయం అందించాల్సిన న్యాయవాదే అక్రమాలకు పాల్పడ్డారు. వివరాలు.. మోటారు వాహన ప్రమాదాల్లో బాధితులకు తెలియకుండానే, వారికి బదులుగా నకిలీ వ్యక్తులను కోర్టులో హాజరుపరిచి, బీమా కంపెనీల నుంచి పరిహారం పేరుతో కోట్లాది రూపాయలు మోసం చేసిన కాంచీపురం జిల్లా న్యాయవాదిని సీబీసీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. కాంచీపురం జిల్లా లోక్ అదాలత్ (ప్రజా ఫిర్యాదుల న్యాయస్థానం)లో కేసులకు సంబంధం లేని వ్యక్తులు హాజరవుతున్నారని, పరిహారం పేరుతో పెద్ద ఎత్తున మోసం జరుగుతోందని తరచూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై 2002 జనవరిలో కాంచీపురం న్యాయవాది పద్మనాభన్ పై సీబీసీఐడీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గత 3 సంవత్సరాలుగా ఈ కేసు విచారణ కొనసాగుతుండగా, ప్రస్తుతం న్యాయవాది పద్మనాభన్‌ను సీబీసీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఇతను కొంతమంది వైద్య సిబ్బందిని తన చెప్పుచేతల్లో పెట్టుకుని, నకిలీ పత్రాలు తయారుచేసి, మోటారు వాహన ప్రమాదాల్లో బాధితులకు బదులుగా వేరే వ్యక్తులను నిలబెట్టి పరిహారం పొందుతున్నట్లు గుర్తించారు. ఉదాహరణకు ఒక కేసులో, వాహన ప్రమాదంలో మరణించిన ఒక యువకుడి కుటుంబానికి తెలియకుండానే, ఆ వ్యక్తి వారసుడిగా నకిలీ వ్యక్తిని ఏర్పాటు చేసి, బీమా కంపెనీని మోసం చేసి రూ.3 లక్షలు పరిహారం పొందాడు. అదేవిధంగా మరో కేసులో, ప్రమాదంలో మరణించిన వ్యక్తుల నిజమైన వారసులకు చెందవలసిన రూ.10.50 లక్షల పరిహారాన్ని తన పేరు మీదకు, తనకు తెలిసిన వారి బ్యాంకు ఖాతాలకు మార్చుకున్నాడు. ఇంకో అడుగు ముందుకు వేసి, ఓ కేసులో ప్రమాదానికి సంబంధించి హాజ రుకావలసిన ఆదిలక్ష్మి అనే మహిళకు బదులుగా లక్ష్మి అనే మహిళను లోక్ అదాలత్ న్యాయస్థానంలో నిలబెట్టి, కోర్టును నమ్మించి రూ.4 లక్షల పరిహారం పొందినట్లు తెలుస్తోంది. నాటకం ముగిసిన తర్వాత వేషం తీసేసినట్లుగా, నటించడానికి వచ్చినవారు పారితోషికం తీసుకుని వెళ్లగా, పరిహారం మొత్తాన్ని తీసుకున్న పద్మనాభన్ విలాసవంతమైన జీవనం సాగిస్తున్నట్లు తెలిసింది. గత ఐదేళ్లుగా పద్మనాభన్ వాదించి పొందిన పరిహారం సెటిల్మెంట్ ద్వారా పొందిన మొత్తం కలిపి చాలా కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నా రు. అతనిపై విచారణ కొనసాగుతోంది.


