షాపింగ్
సందడి
టీ నగర్‌లో రద్దీ
సంక్రాంతి కొనుగోళ్లతో
వాణిజ్య కేంద్రాలు కిటకిట
సాక్షి, చైన్నె : సంక్రాంతి షాపింగ్ సందడి ఆదివారం హోరెత్తింది. అన్ని వాణిజ్య కేంద్రాలు కొనుగోలు దారులతో కిట కిటలాడాయి. ఆమ్నీ బస్సుల చార్జీలు అమాంతంగా పెరిగాయి. వివరాలు.. ‘భోగి, సంక్రాంతి, కనుమ’ సంబరాల్ని ఇంటిళ్లి పాది జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. పండుగకు ఈసారి ఏకంగా ఆరేడు రోజులు సెలవు రావడంతో ఉద్యోగ రీత్యా ఎక్కడెక్కడో ఉన్న వాళ్లందరూ స్వగ్రామాలకు వెళ్లేందుకు పరుగులు తీస్తున్నారు. కొందరు అయితే, శనివారం నుంచి తమ స్వస్థలాలకు బయలుదేరి వెళ్తున్నారు. ప్రత్యేక బస్సులు, రైళ్లు కిట కిటలాడుతున్నాయి. గత రెండు రోజులలో చైన్నె నుంచి వివిధ ప్రాంతాలకు సుమారు 5 లక్షల మంది బయలుదేరి వెళ్లినట్టు రవాణా శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అదే సమయంలో ఆమ్నీ ప్రైవేటు బస్సులు చార్జీలను పెంచేశాయి. ఈ సమాచారంతో రవాణా మంత్రి శివశంకర్ ఆదేశాలతో ప్రత్యేక నిఘా బృందాలు రంగంలోకి దిగాయి.
రెండురోజులే సమయం ఉండడంతో..
పండుగకకు రెండు రోజులే సమయం ఉండడంతో జనం షాపింగ్‌పై దృష్టి పెట్టారు. పండుగకు ముందుగా వచ్చే చివరి ఆదివారం కావడంతో వివిధ నగరాలు, పట్టణాలలో ఉన్న వారంతా షాపింగ్ నిమిత్తం వాణిజ్య కేంద్రాల వైపుగా తరలి వచ్చారు. ఆదివారం మదురై, కోయంబత్తూరు, తిరునల్వేలి, దిండుగల్, తిరుచ్చి, తంజావూరు, తూత్తుకుడి వంటి నగరాలలో వాణిజ్య కేంద్రాలలో షాపింగ్ జోరుగా సాగింది. చైన్నెలో అయితే, టీ నగర్, క్రోంపేట, తాంబరం, వేళచ్చేరి, పురసైవాక్కం, బ్రాడ్ వే తదితర ప్రాంతాలన్నీ జనంతో కిట కిటలాడాయి. కొత్త బట్టల కొనుగోళ్లతో పాటూ వివిధ సామాగ్రిల విక్రయాలు జోరుగా జరిగాయి. రద్దీ నేపథ్యంలో ఆయా ప్రాంతాలలో చైన్నె పోలీసులు నిఘాను కట్టుదిట్టం చేశారు. భద్రతను డేగ కళ్ల నిఘాతో పర్యవేక్షించారు. పండుగ షాపింగ్, చైన్నె నుంచి వివిధ నగరాల వైపుగా బస్సులు,వాహనాల ప్రయాణాల సంఖ్య పెరగడంతో నగర శివారులలోని తాంబరం, పెరుంగళత్తూరు పరిసరాలలో ట్రాఫిక్ మార్పులు సోమవారం నుంచి అమలులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. అలాగే, బోగి పండుగ రోజున ప్లాస్టిక్, టైర్లు వంటి వాటిని కాల్చకుండా అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేశారు.


