అక్టోబర్‌కు వెళ్లి పోయిన ‘ఇడ్లీ కడై’ సినిమావార్త
తమిళసినిమా: నటుడు ధనుష్ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన చిత్రం ఇడ్లీ కడై. నటి నిత్యా మీనన్ నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని నటుడు ధనుష్‌కు చెందిన వండర్ బార్ ఫిలిమ్స్, ఆకాశ్ భాస్కర్‌కు చెందిన డాన్ పిక్చర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. దీనికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇంతకు ముందు ప్రకటించారు. కాగా నటుడు అజిత్ హీరోగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాన్ని నిర్మాతలు ఇదే ఏప్రిల్ 10వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో అజిత్, ధనుష్ చిత్రాల ద్వారా పోటీ అనివార్యంగా మారింది. కాగా తాజాగా అజిత్ చిత్రం అనుకున్న ప్రకారం ఏప్రిల్ 10న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. అయితే ధనుష్ నటిస్తున్న ఇడ్లీ కడై చిత్రం విడుదల మాత్రం సుమారు ఆరు నెలలు వెనక్కి వెళ్లిపోయింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ ఒకటవ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తాజాగా అధికారికంగా ప్రకటించారు. కారణం ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు ఇంకా పూర్తి కాలేదని తెలిపారు. దీంతో అజిత్, ధనుష్ చిత్రాల మధ్య పోటీ తప్పింది. ఇకపోతే ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న మరో చిత్రం కుబేర. ద్విభాషా చిత్రం ( తెలుగు, తమిళం) గా రూపొందుతున్న ఇందులో టాలీవుడ్ స్టార్ నాగార్జున ప్రధాన పాత్రను పోషిస్తుండగా , నటి రష్మిక మందన్న నాయకిగా నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 20వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతల వర్గం ఇప్పటికే అధికారికంగా వెల్లడించారు. దీంతో ఇడ్లీ కడై చిత్రం కంటే కుబేర చిత్రం ముందుగా తెరపైకి రానుందన్నమాట.
నటుడు ధనుష్, నటి నిత్యామీనన్


