ఢిల్లీలో అన్నాడీఎంకే ఎంపీల బిజీబిజీ
సాక్షి, చైన్నె: ఢిల్లీలో అన్నాడీఎంకే ఎంపీలు ఇరువురితో పాటూ నేతలు బిజీ అయ్యారు. ఎంపీ తంబిదురై ఓ వైపు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో, మరోవైపు ఎంపీ సీవీ షణ్ముగం నేతృత్వంలోని ప్రతినిధులు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కావడం ప్రాధాన్యతకు దారి తీసింది. రాష్ట్రంలో2026 అసెంబ్లీ ఎన్నికలలో ఈసారి అన్నాడీఎంకే – బీజీపీల బంధం మళ్లీ ఏర్పడబోతున్నట్టు సంకేతాలు వెలువడ్డ విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి అమిత్ షాతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఓ వైపు, సీనియర్ నేత సెంగోట్టయన్ మరో వైపు భేటీ కావడంతో మళ్లీ వీరి బంధం ఏర్పడడం ఖాయమైనట్టే అన్న చర్చ జోరందుకుంది. అదే సమయంలో రాష్ట్ర బీజేపీలో కొత్త చర్చ ఊపందుకుని ఉంది. అన్నాడీఎంకేతో పొత్తు పొడవాలంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మార్పు అనివార్యం అన్న ప్రచారం జరుగుతోంది. అన్నామలైను తప్పించబోతున్నట్టుగా చర్చ జోరందుకున్న నేపథ్యంలో ఆయనకు మద్దతు స్వరం బీజేపీలో బయలుదేరింది. అన్నామలైను తప్పించ వద్దని, అన్నాడీఎంకేతో పొత్తు వద్దంటూ ఓ వర్గం పోస్టర్ల ప్రచారం విస్తృతం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం అన్నాడీఎంకే ఎంపీలు డిల్లీలో బిజీగా కావడం ప్రాధాన్యత సంతరించుకున్నట్లయ్యింది. ఓ వైపు అమిత్ షాతో ఎంపీ సీవీ షణ్ముగంతో పాటూ మరికొందరు భేటీ కావడంతో రాజకీయ చర్చ ఊందుకుంది. అదే సమయంలో మరో ఎంపీ తంబిదురై సైతం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలవడంతో పొత్తుల చర్చ జోరందుకుంది. ఢిల్లీ వేదికగా సాగుతున్న ఈ పరిణామాలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మార్పుకోసమే అన్న ప్రచారం కూడా సాగడం గమనార్హం.


