చందన కాపు అలంకరణ తొలగింపు
తిరువొత్తియూరు: ఉత్తరకోసమంగై ఆలయ కుంబాభిషేకాన్ని పురస్కరించుకొని మరకత నటరాజ స్వామికి చందన కాపు అలంకరణను తొలగించారు. 3 రోజుల వరకు భక్తులు నటరాజ స్వామిని దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు. వివరాలు.. రామనాథపురం జిల్లా, తిరు ఉత్తకోసమంగైలో మంగళనాథర్ దేవాలయం ఉంది. 15 ఏళ్ల తర్వాత ఈ ఆలయంలో 4వ తేదీన కుంభాషేకం నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు కుంభాభిషేకం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆలయంలో కొలువై ఉన్న అరుదైన మరకత నటరాజ మందిరాన్ని మంగళవారం అర్ధరాత్రి తెరిచి, మరకత నటరాజ విగ్రహానికి పూసిన చందనాన్ని తొలగించారు. అనంతరం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్శనం చేసుకున్నారు. ఆరుద్ర దర్శన పండుగ సందర్భంగా, సంవత్సరంలో ఒక రోజు మాత్రమే మరకత నటరాజ మందిరం తెరవబడి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఈ ఏడాది జనవరి 12వ తేదీన తిరు ఉత్త కోసైమంగై ఆలయంలో మరకత నటరాజ క్షేత్రాన్ని భక్తులు దర్శించుకున్నారు. మరకత నటరాజ క్షేత్రం కుంభాభిషేకం సందర్భంగా 4 రోజుల పాటు తెరిచి ఉండడంతో తమిళనాడులోని పలు ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారని అంచనావేశారు.


