టాస్మాక్ స్కాంపై వాడివేడి వాదనలు
సాక్షి, చైన్నె: టాస్మాక్ ప్రధాన కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)సోదాల వ్యవహారంపై హైకోర్టులో మంగళవారం వాడివేడిగా వాదనలు జరిగాయి. కేసును తప్పుదోవ పట్టించేందుకు తమిళనాడుప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు ఈడీ తరపు న్యాయవాదులు ఆరోపించారు. వివరాలు.. చైన్నెలోని టాస్మాక్ ప్రధాన కార్యాలయంలో గత నెల 6వ తేది నుంచి 8వ తేదీ వరకు మూడు రోజులు ఈడీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. మద్యం విక్రయాలలో అక్రమాలు జరిగినట్టుగా పేర్కొంటూ ఈ సోదాలు జరిగాయి. ఇందులో రూ. 1000 కోట్ల మేరకు అక్రమాలకు సంబంధించిన ఆధారాలు ఈడీకి చిక్కినట్టు సమాచారాలు వెలువడ్డాయి. టాస్మాక్ అధికారులు తమకు కావాల్సిన వారికి బార్ లైసెన్సులు జారీ చేసినట్టు, ఇందులో పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్టుగా ఈడీ గుర్తించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ వ్యవహారాన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా చేసుకుని అసెంబ్లీలో సైతం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా ముందుకెళ్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈడీ తదుపరి అడుగులు వేయడానికి సిద్ధమైనట్టు సంకేతాలు వెలువడ్డాయి. టాస్మాక్ అధికారులను విచారించే దిశగా ఈడీ సిద్ధమవుతున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. దీంతో ప్రభుత్వం, టాస్మాక్ తరపున మూడు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. చట్ట విరుద్ధంగా టాస్మాక్ కార్యాలయంలో సోదాలు జరపడమే కాకుండా,అధికారులు, సిబ్బందిని విచారణ పేరిట వేదించేందుకు ఈడీ చేస్తున్న ప్రయత్నాలకు స్టే విధించాలన్న రాష్ట్రప్రభుత్వ పిటిషన్‌కు హైకోర్టు స్పందించింది. విచారణకు చెక్ పెట్టే విధంగా న్యాయమూర్తులు ఎంఎస్ రమేష్, సెంథిల్‌కుమార్ బెంచ్‌లో గత నెలాఖరులో ఉత్తర్వులు జారీ చేసింది. టాస్మాక్ వ్యవహారంలో అధికారులపై ఎలాంటి చర్యలు, విచారణ వంటి అంశాలపై దృష్టి పెట్ట కూడదని, సమగ్ర వివరణతో నివేదికను సమర్పించాలని ఈడీని న్యాయమూర్తులు ఆదేశించారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం ఈ పిటిషన్‌పై వాదనలు జోరుగా సాగాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాదులు వాదిస్తూ, మహిళా అధికారులను సైతం రేయింబవళ్లు కార్యాలయంలోనే ఉంచి సోదాల పేరిట విచారించారని ఈడీ తీరును వివరిస్తూ వాదనలు వినిపించారు. మానవ హక్కులను ఈడీ ఉల్లంఘించినట్టు పేర్కొన్నారు. అదే సమయంలో ఈడీ తరపున న్యాయవాదులు స్పందిస్తూ, కేసు తప్పుదోవ పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తున్నట్టు వాదించారు. వాడివేడిగా వాదనలు సాగినానంతరం తదుపరి విచారణను న్యాయమూర్తులు ఈనెల 18వ తేదీకి వాయిదా వేశారు.


