
మైడియర్ డయానా వెబ్ సీరీస్ ప్రారంభోత్సవం
నటి ఐశ్వర్య రాజేష్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. స్వశక్తితో కింద నుంచి ఒక్కోమెట్టు ఎక్కుతూ కథానాయకి స్థాయికి ఎదిగిన నటి. ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు. కాగా తాజాగా ఆమె అన్నయ్య మణికంఠ రాజేష్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు.
ఈయన ఇంతకుముందే ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన డ్రైవర్ జమున చిత్రంలో ఒక కీలక పాత్రను పోషించారు. అదేవిధంగా ఇటీవల బిగ్‌బాస్ రియాల్టీ గేమ్‌షోలో పాల్గొని మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సమయంలో తన అన్నయ్యకు సపోర్టుగా నటి ఐశ్వర్యరాజేష్ ప్రచారం చేశారు కూడా. తాజాగా ఈయన కథానాయకుడుగా వెబ్‌సీరీస్‌లో నటిస్తున్నారు. దీనికి మైడియర్ డయానా అనే టైటిల్ నిర్ణయించారు.
దీనికి పీకే విజయ్, గిరిధర్ రామ్ గణేశ్‌ల ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మహాలక్ష్మి అనే నటి కథానాయకిగా పరిచయం అవుతున్నారు. ఐనాకుమార్, అక్షయ ప్రేమనాథ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ వెబ్‌సీరీస్‌కు వాట్స్ ప్రభు చాయాగ్రహణం, గుహ గణేష్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఓర్స్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ వెబ్‌సీరీస్ శుక్రవారం చైన్నెలో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ఐశ్వర్య రాజేష్ ముఖ్య అతిథిగా పాల్గొని వెబ్‌సీరీస్ యూనిట్ వర్గాలకు శుభాకాంక్షలు తెలిపారు.