సూర్యాపేట : ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న అల్పాహారం (టీజీ బ్రేక్‌ఫాస్ట్), మధ్యాహ్న భోజన పథకాన్ని ఇకపై విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి వర్తింపజేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ జూలై 30న ఉత్తర్వులు విడుదల చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఇతర పాఠశాల విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది అందరికీ టీజీ బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాన్ని తక్షణమే అమలు చేయాలని జిల్లా, మండల విద్యా శాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ పథకం అమలుకు అవసరమైన విధంగా ఎండీఎం (మిడ్ డే మీల్స్), టీజీ బ్రేక్‌ఫాస్ట్ పోర్టల్‌లో ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది భోజన వినియోగ వివరాలు నమోదు చేసేలా తగిన మార్పులు చేయాలని అదనపు ఎండీఎం డైరెక్టర్‌కు సూచించారు. ఈ ఉత్తర్వులను అన్ని సంబంధిత అధికారులు వెంటనే అమలు చేసి, ధ్రువీకరించాలని విద్యా శాఖ స్పష్టం చేసింది.
జిల్లాలో 4,118 మంది ఉపాధ్యాయులు
రాష్ట్ర ప్రభుత్వం టీజీ బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి విస్తరించడంతో జిల్లాలో సుమారు 4,118 మంది ఉపాధ్యాయులతో పాటు మరో 2వేల మంది బోధనేతర సిబ్బందికి ప్రయోజనం చేకూరనుంది. జిల్లాలోని 950 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఉండగా, సుమారు 4,118 మంది ఉపాధ్యాయులు, 2000 మందికి పైగా బోధనేతర సిబ్బంది, ఇకపై విద్యార్థులతో పాటు పాఠశాలల్లోనే ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం చేయనున్నారు. ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వులతో ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి రానుంది. దీంతో పాఠశాలల్లో పనిచేసే సిబ్బందికి అదనపు భోజన సౌకర్యం కల్పించడంతో పాటు సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చినట్లు విద్యా శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
దశల వారీగా అమలు
ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి టీజీ బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి కాకుండా, ముందుగా ఎంపిక చేసిన కొన్ని జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని అమలు చేసి, అనంతరం అందుబాటులో ఉన్న వసతులు, నిర్వహణ సౌలభ్యాన్ని బట్టి మిగతా జిల్లాలకు విస్తరించే అవకాశమున్నట్లు సమాచారం. అయితే ఈ అమలు విధానం, ఎంపికయ్యే జిల్లాలు, తదితర అంశాలపై పాఠశాల విద్యా శాఖ నుంచి పూర్తిస్థాయి అధికారిక వివరాలు వెలువడాల్సి ఉంది.
పకడ్బందీగా అమలు చేస్తాం
ఉపాధ్యాయులకు భోజనం, బ్రేక్ ఫాస్ట్‌కు సంబంధించి అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. పాఠశాలల్లో విధులు నిర్వహించే ఉపాధ్యాయులు అవసరమైన సమయంలో భోజనం చేసుకోవడంపై ఎలాంటి నిషేధం లేదు. ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనం తినొచ్చు. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు రాగానే పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తాం.
– అశోక్, జిల్లా విద్యా శాఖ అధికారి
భోజనంతోపాటు అల్పాహారమూ
అందించేలా ప్రభుత్వం కార్యాచరణ
బోధనేతర సిబ్బందికి సైతం వర్తింపు
పథకం అమలుకు ఆదేశాలు జారీచేసిన విద్యా శాఖ


