సూర్యాపేట హరిజనవాడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల
చెట్ల కిందే విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయురాలు
సూర్యాపేటటౌన్ : జిల్లా కేంద్రంలోని హరిజనవాడ ప్రాథమిక పాఠశాలకు సొంత భవనం లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పాఠశాల అద్దె భవనంలో కొనసాగుతుండగా అదికూడా శిథిలావస్థకు చేరడంతో చెట్లకిందే చదువులు కొనసాగించాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం పాఠశాలలో 35 మంది విద్యార్థులు ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. పాఠశాలకు రెండు గదులు మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ పైకప్పు రేకులు పగిలిపోయి వర్షం వచ్చినప్పుడు నీరు కారుతుండటంతో విద్యార్థులను గదుల్లో కూర్చోబెట్టలేని పరిస్థితి నెలకొంటోంది. మౌలిక వసతులు సైతం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం విద్య కోసం కోట్లు ఖర్చు పెడుతున్నా ఇలాంటి పాఠశాలలను మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
తరగతి గదులు లేక..
పాఠశాలలో రెండు గదులు, అవి కూడా చిన్నగా.. వెంటిలేషన్ లేకుండా ఉన్నాయి. గదుల పైకప్పు రేకులు పగిలిపోవడంతో వర్షం వస్తే నీళ్లు కారుతున్నాయి. దాంతో ఉపాధ్యాయులు విద్యార్థులను చెట్ల కిందే కూర్చొబెట్టి పాఠాలు బోధిస్తున్నారు. భవనానికి చెల్లించాల్సిన అద్దెను పాఠశాల గ్రాంట్లతో పాటు ఉపాధ్యాయులు తమ సొంత డబ్బులు వెచ్చించి చెల్లిస్తున్నట్లు సమాచారం. పాఠశాలకు సొంత భవనం, సరైన తరగతి గదులు, ఆటస్థలం, ఇతర వసతులు లేకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించేందుకు వెనుకాడుతున్నారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా విద్యార్థుల సంఖ్య స్థిరంగా ఉండిపోతోందని పేర్కొంటున్నారు. హరిజనవాడ ప్రాంతంలోని చిన్నారుల విద్యాభివృద్ధికి ఈ పాఠశాల కీలకంగా ఉన్నందున వెంటనే సొంత భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని స్థానికులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఫ అద్దె భవనం.. అరకొర వసతులు
ఫ సూర్యాపేట హరిజనవాడ
ప్రాథమిక పాఠశాల దుస్థితి
ఫ సొంత భవనం లేక
అడ్మిషన్లపై ప్రభావం


