మోగిన బడి గంట
● పండుగలా కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం
● పాఠశాలల్లో విద్యార్థులకు
పూలతో స్వాగతం
● అమావాస్య ప్రభావంతో
తగ్గిన విద్యార్థుల హాజరు
సూర్యాపేటటౌన్ : వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు సోమవారం పునఃప్రారంభమవడంతో జిల్లావ్యాప్తంగా బడి గంట మోగింది. పలుచోట్ల ఉపాధ్యాయులు పాఠశాల ప్రాంగణాలను రంగురంగుల కాగితాలు, మామిడి తోరణాలతో అలంకరించి పండుగ వాతావరణంలో పాఠశాలలను పునఃప్రారంభించారు. కొత్త విద్యా సంవత్సరానికి శ్రీకారం చుడుతూ పలు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులకు పూలు అందజేసి ఆప్యాయంగా స్వాగతం పలికారు. మొదటి రోజు బడులకు వచ్చిన విద్యార్థులు తమ స్నేహితులు, ఉపాధ్యాయులను ఆనందంగా గడిపారు. పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు ప్రభుత్వం అందజేసే పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలను మొదటి రోజే పంపిణీ చేశారు. కొన్ని పాఠశాలల్లో మిఠాయిలు పంచి విద్యార్థులను ఉత్సాహపరిచారు.
తొలిరోజు అమావాస్య ఆటంకం
తొలి రోజు విద్యార్థుల హాజరు ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. కేవలం 13 శాతం విద్యార్థులే హాజరైనట్టు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. సోమవారం అమావాస్య కావడంతో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలలకు పంపేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. ఈ కారణంగా హాజరు శాతం తగ్గినట్లు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. మరోవైపు వ్యవసాయ పనుల నేపథ్యంలో కుటుంబాలతో ఉండడం వంటి బడులకు గైర్హాజరైనట్లు తెలుస్తోంది. అయినప్పటికీ వచ్చే రెండు మూడు రోజుల్లో హాజరు శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.
పాఠ్య, నోట్ పుస్తకాలు అందజేత
చాలా ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి రోజు హాజరైన విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు అందజేశారు. దీంతో విద్యార్థులు కొత్త పుస్తకాలు రావడంతో ఆనందంలో మునిగిపోయారు. అమావాస్య కావడంతో కొత్త అడ్మిషన్లు కూడా ఎక్కడా రాలేదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
చాలా పాఠశాలల్లో విద్యార్థులే రాలే..
మొదటి రోజు పాఠశాలలకు జిల్లాలోని చాలా పాఠశాలల్లో విద్యార్థులే రాని పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని ప్రాథమిక పాఠశాలలు, యూపీఎస్‌లతో పాటు ఒకటి రెండు హైస్కూళ్లలో విద్యార్థులు ఒక్కరు కూడా రాకపోవడంతో ఉపాధ్యాయులు పాఠశాలను ఓపెన్ చేసి ఖాళీగా కూర్చున్నారు. కొన్ని పాఠశాలల్లో ఇద్దరు ముగ్గురు విద్యార్థులే పాఠశాలలకు వచ్చారు.
క్రమశిక్షణతో చదవాలి : ఎస్పీ
సూర్యాపేటటౌన్ : నూతన విద్యా సంవత్సరంలో అడుగు పెడుతున్న విద్యార్థులకు జిల్లా పోలీసు శాఖ తరపున ఎస్పీ నరసింహ శుభాకాంక్షలు తెలిపారు. మీ రక్షణ మా బాధ్యత.. ఉపాధ్యాయులు నేర్పే పాఠాలు శ్రద్ధగా నేర్చుకోవాలని పేర్కొన్నారు. కష్టపడి చదువుకోవాలని, తోటివారితో స్నేహంగా ఉండాలని, చెడు అలవాట్లకు గురి కావద్దని పేర్కొన్నారు. ముఖ్యంగా పాఠశాల లేదా కళాశాలకు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచించారు. సోషల్ మీడియాలో అనవసరమైన మెసేజ్‌లు పెట్టవద్దని, చదువులో మీ లక్ష్యంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. తెలియని వ్యక్తుల నుంచి మీ ఫోన్లకు వచ్చే లింక్‌లను క్లిక్ చేయవద్దని కోరారు. వ్యక్తిగత వివరాలను, బ్యాంక్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. మీ లక్ష్యాల సాధనలో క్రమశిక్షణే మీ అసలైన ఆయుధం. ఈ విద్యా సంవత్సరం మీకు విజయాన్ని అందించాలని ఆకాక్షించారు.


