మాదిగలదే అగ్రస్థానం | - | Sakshi
Sakshi News home page

మాదిగలదే అగ్రస్థానం

Apr 17 2026 10:26 AM | Updated on Apr 17 2026 10:26 AM

ఓసీల్లో రెడ్లే ఎక్కువ

అధిక సంఖ్యలో యాదవులు

సమగ్ర కుల గణన నివేదిక విడుదల చేసిన ప్రభుత్వం

కోదాడ : ప్రభుత్వం ప్రకటించిన సమగ్ర కుల గణనలో జిల్లాలో ఏ కులానికి చెందిన వారు ఎంత మంది ఉన్నారో తేటతెల్లమైంది. అన్ని కులాలకు చెందిన వారు 10,72,389 మంది ఉండగా ఏ కులానికి చెందని వారు 2,334 మంది ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ (ముస్లిం), బీసీ, ఓసీ విభాగాలు జరిగిన కులగణనలో ఏ సామాజిక వర్గానికి చెందినవారు ఎంత మంది ఉన్నారు, జిల్లా జనాభాలో వారి శాతం ఎంత అన్న విషయాలను ప్రభుత్వం తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. జిల్లాలో బీసీ జనాభా ఎక్కువ మంది ఉండగా ఆ తరువాత ఎస్సీ, ఎస్టీ, ఓసీ, బీసీ(ముస్లింలు) ఉన్నారు.

ఎస్సీల్లో మాదిగలు 70.21 శాతం

ప్రభుత్వ నివేధిక ప్రకారం జిల్లాలో ఎస్సీ జనాభా 2,21,989 మంది ఉన్నారు. మొత్త జిల్లా జనాభాలో వీరు 20.70 శాతం ఉన్నారు. వారిలో మాదిగలు 1,55,854 మంది ఉన్నారు. ఎస్సీ జనాభాలో వీరు 70.21 శాతం ఉన్నారు. మాలలు 48,363 మందితో 21.79 శాతం ఉన్నారు. వీరితో పాటు బుడిగ జంగాలు 6,780 మంది, బైండ్లవారు 1,388 మంది ఉన్నారు. ఇక మిగిలిన 54 ఎస్సీ ఉపకులాలకు సంబంధించి 9,604 మంది ఉన్నారు.

ఎస్టీల్లో లంబాడీలదే మొదటిస్థానం

జిల్లాలో ఎస్టీ జనాభా 1,50,665 మంది ఉన్నారు. వీరిలో లంబాడీ, బంజార, సుగాలీలు 1,41,884 మంది ఉన్నారు. మొత్తం ఎస్టీ జనాభాలో వీరి శాతం 94.17 శాతంతో సమానం. ఇక ఎస్టీల్లో ఎరుకల సామాజికవర్గం 6,555 మందితో 4.45 శాతం, మిగిలిన 30 ఉపకులాల కలిపి 2,226 మంది ఉన్నారు.

బీసీ ముస్లింలు 62వేలకుపై పైగానే..

జిల్లాలో బీసీ–ముస్లిం (బీసీ–ఈ)లు 62,885 మంది ఉన్నారు. వీరు మొత్తం బీసీ జనాభాలో 5.86. ఈ విభాగంలో షేక్‌లు 48,198 మంది ఉండగా జింకల సాయిబులు 1,668 మంది ఉన్నారు. ఈ విభాగంలో మొత్తం 13 ఉపకులాలను చేర్చారు.

జిల్లాలో 1,34,768 మంది ఓసీ జనాభా ఉన్నారు. వీరు మొత్తం జిల్లా జనాభాలో 12.57 శాతంతో సమానం. వీరిలో రెడ్డి సామాజిక వర్గం 80,186 మంది ఉన్నారు. తరువాత కోమటి 20,937, కమ్మ 16,659, వెలమ 4,444, బ్రాహ్మణ 3,158, ఓసీ ముస్లిం 3,279 మంది ఉన్నారు. జిల్లాలో 2,334 మంది తమకు ఎలాంటి కులం లేదని చెప్పారు.

ఫ ఎస్టీల్లో లంబాడీలే అధికం

ఫ బీసీల్లో యాదవులది మొదటి స్థానం

ఫ ఓసీల్లో రెడ్లదే ఆధిపత్యం

ఫ క్రిస్టియన్‌లు 785 మంది మాత్రమే..

జనాభాలో బీసీలదే అగ్రస్థానం. ముస్లిలు (బీసీ–ఈ)కాకుండా ఇతర బీసీలు 5,01,982 మంది ఉన్నారు. వీరు మొత్తం జిల్లా జనాభాలో 46.81 శాతంతో సమానం. బీసీలలో బీసీ–ఏలో 57 ఉపకులాలు, బీసీ–బీలో 27, బీసీ–సీలో 01, బీసీ–డి 33 ఉపకులాలను ఉంచారు. యాదవులు 1,10,069 మందితో అగ్రస్థానంలో ఉన్నారు. ఈ తరువాత గౌడలు 1,07,330 మంది, ముదిరాజ్‌లు 52,744 మంది, చాకలి 34,392 మంది, మున్నూరు కాపు 39,814 మంది, వడ్డెర 29,297, పెరిక 24,266 మంది, వడ్ల 18,672, పద్మశాలి 17,607, కుమ్మరి 16,656, నాయీబాహ్మణులు 11,494, దూదేకుల 9,035, గోల్డుస్మిత్‌ 4,027, బ్లాక్‌స్మిత్‌ 3,292 మంది ఉన్నారు. బీసీ–సీ సామాజిక వర్గంలో క్రిస్టియన్‌లు 785 మందే ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement