సూర్యాపేటటౌన్ : వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించాలని సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ పోలీసులను ఎస్పీ నరసింహ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద కొత్తగా ఏర్పాటు చేస్తున్న ట్రాఫిక్ సిగ్నల్ పనులను సంబంధిత అధికారులతో కలిసి గురువారం ఎస్పీ పరిశీలించారు. బస్టాండ్ ప్రాంగణంలో రహదారులపై ఉన్న ట్రాఫిక్ రద్దీని, రోడ్ల వెంబడి నిర్వహిస్తున్న వ్యాపార సముదాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో రోజురోజుకు వాహనాల రద్దీ పెరుగుతున్నందున పోలీస్ శాఖ ట్రాఫిక్ నియంత్రణ చేస్తూ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతోందన్నారు. ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాట్ల పనులను వేగంగా పూర్తి చేయాలని, మున్సిపల్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు. ఆర్టీసీ అధికారులను సంప్రదించి కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సుల రాకపోకలు, మార్గాలను సులభతరం చేయాలన్నారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి పోలీస్ సిబ్బందిని బలోపేతం చేస్తామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, ట్రాఫిక్ ఎస్‌ఐ సాయిరాం పాల్గొన్నారు.
ప్రశ్నించే గొంతుకలపై దాడులను ఖండించాలి
సూర్యాపేట అర్బన్ : ప్రశ్నించే గొంతుకలపై దాడులను ఖండించాలని సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ అన్నారు. సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుపై నమోదు చేసిన దేశద్రోహం కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద సీపీఐ(ఎంఎల్ )మాస్‌లైన్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని అన్నారు. కార్యక్రమంలో సామాజిక అధ్యయన వేదిక కన్వీనర్ లింగంపల్లి భద్రయ్య, డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లింగయ్య, కారింగుల వెంకన్న, ఎర్ర అఖిల్ కుమార్, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చంద్రకళ, కొత్తపల్లి రేణుక, సంతోషిమాత, కల్పన, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు భీమనపల్లి ప్రకాష్, నితిన, రాజు, నారాయణ పాల్గొన్నారు.


