ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించాం. కార్పొరేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన, డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నాం. పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రస్తుతం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత కూడా లేదు.
–అశోక్, డీఈవో
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల పెంపే లక్ష్యంగా ప్రభుత్వం ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. గత ఏడాది అధికారికంగా నిర్వహించకపోయినా.. కలెక్టర్ ఆదేశాల మేరకు కొన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ముందస్తు బడిబాట నిర్వహించి విద్యార్థుల పెంపే లక్ష్యంగా పనిచేశారు. ఉపాధ్యాయులు గ్రామాల్లో తిరుగుతూ బడి బయట ఉన్న పిల్లలను గుర్తిస్తున్నారు.
జిల్లాలో 950 ప్రభుత్వ పాఠశాలలు..
జిల్లాలో ప్రస్తుతం 950 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 690 ప్రాథమిక పాఠశాలలు, 70 ప్రాథమికోన్నత పాఠశాలలు, 190 ప్రభుత్వ ఉన్నత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో మొత్తం 70 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపే లక్ష్యంగా ప్రతిఏటా జూన్‌లో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది ప్రభుత్వం ముందస్తుగానే బాడిబాట నిర్వహించాలని ఆదేశించడంతో ఈ నెల 6వ తేదీ నుంచే ప్రారంభించారు.
విద్యార్థుల గుర్తింపు...
సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో బడిబాట కార్యక్రమం జూన్‌్ 2 నుంచి నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది ప్రభుత్వం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక మొదలుపెట్టడంతో.. ఈ కార్యక్రమంలో భాగంగా ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. జిల్లాలో ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ముందస్తు బడిబాట కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఒంటిపూట బడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య బడిబాట నిర్వహిస్తున్నారు. మరికొన్ని పాఠశాలల్లో మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత నిర్వహిస్తున్నారు. గ్రామంలో బడి బయట ఉన్న పిల్ల లను, ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులను గుర్తిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, డిజిటల్ తరగతులు గురించి పిల్లలకు, తల్లిదండ్రులకు వివరించి ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా ప్రోత్సహిస్తున్నారు.
గత ఏడాది 7వేల మంది విద్యార్థులు..
గత ఏడాది ముందస్తు బడిబాట జిల్లాలో విద్యార్థుల సంఖ్య పెంపునకు దోహదపడింది. ముఖ్యంగా గత ఏడాది జూన్ వరకు దాదాపు 7వేల మంది విద్యార్థులను గుర్తించి ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. ఈ ఏడాది కూడా అధిక సంఖ్యలో విద్యార్థులను చేర్పించడమే లక్ష్యంగా విద్యాశాఖ ప్రయత్నిస్తోంది.
ఫ ఈ నెల 6 నుంచి
ప్రారంభమైన కార్యక్రమం
ఫ జూన్ 12వ తేదీ వరకు కొనసాగింపు
ఫ బడి బయట, ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే విద్యార్థుల గుర్తింపు
ఫ ప్రభుత్వ పాఠశాలల్లో
చేర్పించడమే లక్ష్యం


