చివ్వెంల : సూర్యాపేట పట్టణంలోని జిల్లా జనరల్ హాస్పిటల్‌లో శుక్రవారం నిర్వహించనున్న మెగా ఆయుష్ వైద్య శిబిరాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయుష్ విభాగం జిల్లా ఇన్‌చార్జ్ డాక్టర్ బి.రామకృష్ణ గురువారం ఒక ప్రకటనలో కోరారు. పక్షవాతం, ఫైల్స్, కీళ్లవాతం, చర్మవ్యాధులు, ఎలర్జీ వంటి వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
జెడ్పీ సీఈఓగా శిరీష
సూర్యాపేట : జెడ్పీ డిప్యూటీ సీఈఓగా పనిచేసిన శిరీషకు సీఈఓగా పదోన్నతి లభించింది. ఆమె సూర్యాపేట జెడ్పీ సీఈఓగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా గురువారం కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్‌ను శిరీష కలిసి పూలమొక్క అందజేశారు. ఆమెకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.
బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడిగా మహేష్‌చారి
సూర్యాపేటటౌన్ : బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడిగా సూర్యాపేటకు చెందిన పోలోజు మహేష్‌చారి నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని బీసీ సంఘం కార్యాలయంలో మహేష్‌చారికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ర్యాగ అరుణ్‌కుమార్ నియామకపత్రం అందజేశారు.
శ్రీలక్ష్మీనరసింహుడికి
విశేష పూజలు
మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామికి అర్చకులు విశేషంగా పూజలు నిర్వహించారు. ఆలయంలో శ్రీస్వామిఅమ్మవార్లకు అభిషేకాలు, హోమశాలలో నిత్యహోమం నిర్వహించారు. నిత్య కల్యాణంలో భాగంగా శ్రీస్వామిఅమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం గావించారు. రక్షాబంధనం, మదుఫర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలతో కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీస్వామిఅమ్మవార్లను గరుడ వాహనంపై అధిష్టించి ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఈ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చె న్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈవో బి.జ్యోతి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.


