సూర్యాపేట : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మేలు జరిగేలా చూడాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. సూర్యాపేట మండలం ఎర్కారం గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 281 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు 4 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రావొచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసే యంత్రాలు, తేమశాతం కొలిచే మిషన్లు, తాగునీరు, టెంట్లు, టార్పాలిన్ పట్టాలు అందుబాటులో ఉంచామన్నారు. 2, 3 మండలాలకు కలిపి ఒక ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్‌ను నియమించామని, జిల్లాస్థాయిలో కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అలాగే మండల స్థాయిలో ధాన్యం కొనుగోలు కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే కాంటాలు వేయాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని పీఏసీఎస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో సివిల్ సప్లై జిల్లా అధికారులు మోహన్‌బాబు, శ్రీధర్, జిల్లా కోఆపరేటీవ్ అధికారి ప్రవీణ్, పీఏసీఎస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


