ప్రభుత్వం పారాక్వాట్ గడ్డిమందుపై నిషేధం విధించింది. జిల్లాలో ఈ మందు నిల్వ చేయడం, వాడకం ఎవరూ చేయొద్దు. ప్రాణాంతకమైన ఈ మందుతో చాలా ఇబ్బందులు వస్తాయి.
– శ్రీధర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి
భానుపురి (సూర్యాపేట) : గడ్డిమందు తాగి చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగి పోతోంది. గడ్డిమందుకు విరుగుడు లేకపోవడంతో ఈ మందును ఏమాత్రం తీసుకున్నా మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలురకాల గడ్డిమందులు, అందులోనూ పారాక్వాట్ అనే మరో రకం గడ్డిమందుపై నిషేధం విధించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ఈ మందు వాడకంపై నిషేధం విధిస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటించింది. ఇప్పటికే జీవో 24జారీ చేశారు. నిషేధంతో పారాక్వాట్ వినియోగం, నిల్వలపై యంత్రాంగం దృష్టిసారించింది.
జిల్లాలో కొద్దిమొత్తంలోనే వినియోగం
జిల్లాలో ఈ పారాక్వాట్ వినియోగం కొద్దిమొత్తంలోనే ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా ఈ మందును మెట్టపంటల్లో కలుపు నివారణ కోసం వాడుతుంటారు. దీంతో గడ్డి జాతులకు చెందిన పలు రకాల కలుపు వెంటనే చనిపోతోంది. కూలీల ఖర్చు లేకుండా చాలామంది ఈ మందునే వాడుతున్నారు. అయితే తమ పంటలకు వాడుకోగా.. మిగిలిన మందును రైతులు మరోసారి వాడుకోవచ్చన్న ఉద్దేశంతో ఇళ్లు, పొలాల వద్దనే ఉంచుతున్నారు. అనుకోకుండా ఇంట్లో జరిగే చిన్నచిన్న తగా దాలకు క్షణికావేశంతో ఈ మందును తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలా క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడే ఘటనలు జిల్లాలో చాలా కాలంగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు ఈ మందు వాడకంపై వివరాలు సేకరించగా జిల్లాలో ప్రతి సంవత్సరం దాదాపు 200 లీటర్ల గడ్డిమందును వాడుతున్నట్లు గుర్తించారు. ఈ ఒక్క పారాక్వాట్ గడ్డి మందు కాకుండా ఇతర గడ్డి మందులు తాగిన వారి పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని రైతులు, ప్రజలు అంటున్నారు. గడ్డి మందులు తాగితే మనిషి ఎక్కువకాలం బతకడం కష్టమేనని రైతులు చెప్పుకుంటున్నారు. వైద్యులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఫ మెట్టపంటల్లో కలుపు నివారణకు ఈ గడ్డిమందు వినియోగం
ఫ జిల్లాలో ప్రతి సంవత్సరం
200 లీటర్ల వరకూ వాడకం
ఫ నిషేధంతో వినియోగం,
నిల్వలపై యంత్రాంగం దృష్టి


