వరిలో తెగుళ్లు – నివారణ చర్యలు | - | Sakshi
Sakshi News home page

వరిలో తెగుళ్లు – నివారణ చర్యలు

Feb 24 2026 7:52 AM | Updated on Feb 24 2026 7:52 AM

వరిలో

వరిలో తెగుళ్లు – నివారణ చర్యలు

త్రిపురారం : యాసంగి సీజన్‌లో వరి పంటకు సోకే తెగుళ్లు, చీడపీడలను రైతులు సరైన సమయంలో గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. లేదంటే దిగుబడి తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం రైతులకు సకాలంలో యూరియా దొరక్క వరి చేలు గిడసబారిపోతున్నాయి. సాగర్‌ ఆయకట్టు కింద వరి చేలు ప్రస్తుతం పొట్ట దశలో ఉండగా.. పలు ప్రాంతాల్లో ఈనిక దశలో ఉన్నాయి. ఈ క్రమంలో వరి పంటకు సోకే చీడపీడలు, వాటి నివారణకు కంపాసాగర్‌ కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) ప్రోగాం కోఆర్డినేటర్‌ చంద్రశేఖర్‌ సూచనలు..

అగ్గి తెగులు : వరి పంటలో వచ్చే అగ్గి తెగులు నివారణకు ట్రైసైక్లోజోల్‌ 1.6 గ్రాములు లేదా కాసుగామైసిన్‌ 2.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. నత్రజని ఎరువులను తగ్గించుకొని, పొలం గట్లపై కలుపును తీసివేయాలి.

మొగి పురుగు లేదా కాండతొలుచు పురుగు : వరి పంటలో వాతావరణ పరిస్థితులను బట్టి కాండం తొలుచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు కార్టాప్‌ హైడ్రోక్లోరైడ్‌ 50 ఎస్‌పీ 2 గ్రాములు లేదా 0.3 మి.లీ. క్లోరాట్రానిలిపోల్‌ 18.5 ఎస్‌పీ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి

కాండం కుళ్లు తెగులు : కాండం కుళ్లు తెగులు నివారణకు 2 మి.లీ. హెక్సాకోనాజోల్‌ లేదా 1 గ్రాము కార్బండిజమ్‌ లేదా 1 మి.లీ. టేబుకో నాజోల్‌ 15 రోజులు వ్యవధిలో రెండు సార్లు పలకల కింద వరకు తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలి.

ఆకు ముడత తెగులు : వరిలో ఆకు ముడత తెగులు నివారణకు కార్టాఫ్‌ హైడ్రోక్లోరైడ్‌ 2 గ్రాములు లేదా క్లోరిపైరిపాస్‌ 2.5 మి.లీ. లేదా ఎసిఫేట్‌ 1.5 గ్రాములు లీటరు నీటిలో కలిపి చేనుపై పిచికారీ చేసుకోవాలి

ఉల్లికోడు తెగులు : వరిలో ప్రస్తుత పరిస్థితుల్లో ఉల్లికోడు తెగులు ఎక్కువగా ఆశిస్తున్నందున దీని నివారణకు నాటిన 10 నుంచి 15 రోజుల కార్బోఫ్యూన్‌ గులికలు ఎకరాకు 10 కిలోలు లేదా ఫోరేట్‌ గులికలు 5 కిలోలు ఎకరాకు లేదా ఫిప్రోనిల్‌ 2.5 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.

ఎండాకు తెగులు : నారుమడి దళ నుంచి గింజ పాలు పోసుకునే వరకు ఎండాకు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. చెట్టు నీడ పడే ప్రదేశంలో ఎక్కువగా ఎండాకు తెగులు ఆశించి మిగిలిన పంటకు వేగంగా వ్యాప్తిస్తుంది. ఈ తెగులు సోకిన ప్రదేశంలో ముదురు ఆకులకు పసుపు రంగు మచ్చలు ఏర్పడి పైనుంచి కింది అంచుల వెంబడి వ్యాప్తించి ఎండుతూ వస్తాయి. ఉదయం సమయంలో ఆకుల మీద పసుపు రంగు జిగురు ముద్దలు కనబడతాయి. ఎండ వేడిమికి గట్టిపడి రాలిపోతాయి. ఈ ఎండిన బాక్టీరియా ముద్దలు నీటి ద్వారా వెళ్లి మిగిలిన పంటకు వ్యాప్తిస్తుంది.

నివారణ చర్యలు

ఎండాకు తెగులు సోకిన మొక్కల నుంచి మిగతా పంటకు నీరు పారకుండా చూసుకోవాలి. ఈ తెగులు ఆశించిన పొలంలో నత్రజని వేయకూడదు. కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ 30 గ్రాములు మరియు ప్లాంటోమైసిన్‌ 4 గ్రాములు లేదా పోషామైసిన్‌ లేదా స్రైటప్లోసైక్లిన్‌ 4 గ్రాములు 10 లీటర్ల నీటిలో కలిపి 2 నుంచి 3 సార్లు వారం వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి.

కేవీకే కంపాసాగర్‌ ప్రోగ్రాం

కోఆర్డినేటర్‌ చంద్రశేఖర్‌ సూచనలు

వరిలో తెగుళ్లు – నివారణ చర్యలు1
1/2

వరిలో తెగుళ్లు – నివారణ చర్యలు

వరిలో తెగుళ్లు – నివారణ చర్యలు2
2/2

వరిలో తెగుళ్లు – నివారణ చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement