రియాక్టర్‌ పేలుడుతో భారీ నష్టం | - | Sakshi
Sakshi News home page

రియాక్టర్‌ పేలుడుతో భారీ నష్టం

Feb 15 2026 12:37 PM | Updated on Feb 15 2026 12:37 PM

రియాక్టర్‌ పేలుడుతో భారీ నష్టం

రియాక్టర్‌ పేలుడుతో భారీ నష్టం

బృందావన్‌ లేబొరేటరీస్‌ కంపెనీని పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ,

వివిధ శాఖల అధికారులు

పూర్తిగా ధ్వంసమైన పరిశ్రమలోని

రెండు ప్రొడక్షన్‌ బ్లాకులు

రియాక్టర్‌లో ఒత్తిడి పెరగడంతోనే ప్రమాదం జరిగినట్లు అంచనా

నలుగురు కార్మికులకు స్వల్ప గాయాలు

చౌటుప్పల్‌: మండల పరిధిలోని ఎల్లగిరి గ్రామ శివారులోని బృందావన్‌ లేబొరేటరీస్‌ కంపెనీలో శుక్రవారం రాత్రి రియాక్టర్‌ పేలుడుతో భారీగానే నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. కంపెనీలోని ఉత్పత్తుల విభాగంలోని రియాక్టర్‌లో ఒత్తిడి పెరగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పరిశ్రమ నిర్వాహకులు అంచనా వేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆయా బ్లాకుల్లో కార్మికులు ఉన్నప్పటికీ ప్రమాదాన్ని ముందే పసిగట్టి దూరంగా పరుగు తీయడంతో ప్రాణనష్టం తప్పింది. ఒక్కో ఉత్పత్తుల విభాగంలో 20 వరకు రియాక్టర్లు ఉండగా.. రెండు విభాగాల్లో మాత్రమే ఈ ప్రమాదం జరిగింది. ఒక ఉత్పత్తుల విభాగంలో మాత్రమే ప్రమాదం చోటుచేసుకోవడంతో అందులోని ఒక రియాక్టర్‌ భారీ శబ్దంతో పేలిపోయింది. మరో విభాగంలోని రియాక్టర్లకు ఏమీ జరగలేదు. రియాక్టర్‌ పేలుడుతో ఉత్పత్తుల విభాగం బ్లాక్‌లతో పాటు కంపెనీలోని పలు భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కొన్ని భవనాలు కూలిపోయాయి. పేలుడు ధాటికి సామగ్రి, శిథిలాలు కంపెనీ పరిసరాల్లో ఎగిరిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది శనివారం తెల్లవారుజాము వరకు శ్రమించి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం కారణంగా నష్టం కోట్లల్లోనే ఉంటుందని పరిశ్రమ ఎండీ రామయ్య తెలిపారు.

ఘటనా స్థలాన్ని సందర్శించిన అధికారులు

బృందావన్‌ లేబొరేటరీస్‌ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుసుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు, ఎస్పీ అక్షాంశ్‌యాదవ్‌ శుక్రవారం అర్ధరాత్రే ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మంటలను అదుపుచేసి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కాలుష్యనియంత్రణ మండలి ఈఈ వెంకన్న, పరిశ్రమల విభాగం, రెవెన్యూ, పోలీసులు, ఇతర శాఖల అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు.

ప్రమాదంపై విచారణ జరిపించాలి

ఈ ప్రమాదంపై విచారణ జరిపించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్‌ డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన పరిశ్రమను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శిథిలాలను వెంటనే తొలగించి కార్మికుల వివరాలు ప్రకటించాలని కోరారు. ఆయన వెంట కల్లూరి మల్లేశం, ఆవనగంటి వెంకటేశం, పాష, బూరుగు కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.

నలుగురికి గాయాలు

రియాక్టర్‌ పేలిన సమయంలో శిథిలాలు ఎగిరిపడడంతో పరిశ్రమలో పనిచేస్తున్న పగడాల సాయి, దుర్గాప్రసాద్‌, అరుణ్‌కుమార్‌, కోమలేష్‌ అనే కార్మికులకు స్వల్ప గాయాలైనట్లు చౌటుప్పల్‌ సీఐ మన్మథకుమార్‌ తెలిపారు. వారిని శుక్రవారం రాత్రే చౌటుప్పల్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయించినట్లు పేర్కొన్నారు. క్షతగాత్రుడు పగడాల సాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement