రామలింగేశ్వరాలయంలో శివపార్వతుల కల్యాణం
యాదగిరిగుట్ట : యాదగిరి క్షేత్రానికి అనుబంధంగా ఉన్న పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. మూడవ రోజైన శనివారం ఉదయం ఆలయంలో నిత్య హవనం, శివపంచాక్షరీ జపం, నందీశ్వర పారాయణం, పంచ సూక్త పఠనం చేశారు. యజ్ఞ బ్రహ్మ ఆధ్వర్యంలో రుద్ర హవనం జరిపించారు. సాయంత్రం స్తోత్ర, వేద, నమక, చమక పారాయణములు, మంత్ర పుష్ప పఠనములు, సోమకుంభార్చనలు, మూలమంత్ర పారాయణాలు యధావిధిగా నిర్వహించారు. మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శివాలయ ఉత్తర దిశలోని కల్యాణ మండపంలో రాత్రి 8గంటలకు శ్రీపర్వత వర్ధిని రామలింగేశ్వరుడి కల్యాణ మహోత్సవం నిర్వహించారు. అదేవిధంగా శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి కల్యాణం వైభవంగా జరిపించారు. వేడుకల్లో ఆలయ అధికారులు, ఆలయ ప్రధాన పూజారులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆలయంలో నేడు..
మహా శివరాత్రిని పురస్కరించుకొని ఆదివారం పర్వత వర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయంలో అభిషేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాత్రి మహాన్యాస పూర్వక శతరుద్రాభిషేకం జరిపించనున్నారు.


