చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
భూదాన్‌పోచంపల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. పోచంపల్లి మున్సి పాలిటీ పరిఽధిలోని ముక్తాపూర్‌కు చెందిన నోముల వెంకట్‌రెడ్డి(45) ఈ నెల 12న పని మీద బైక్‌పై పోచంపల్లికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. ముక్తాపూర్ క్రాస్ రోడ్డు సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న ఆటోను ఓవర్‌టేక్ చేయబోయి ఎదురుగా వచ్చిన మరో వాహనదారుడిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో వెంకట్‌రెడ్డి రోడ్డుపై పడిపోవడంతో అతడి తలకు తీవ్రగాయమై కోమాలోకి వెళ్లాడు. విషయం తెలుసుకున్న వెంకట్‌రెడ్డి కుటుంబ సభ్యులు అతడిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడు బోర్‌వెల్ డ్రిల్లర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
ఎంజీయూ హాస్టల్‌లో విద్యార్థుల ఆందోళన
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని హాస్టల్‌లో విద్యార్థులు ఉపయోగించే తాగు నీటి రిఫ్రిజిరేటర్‌లో శనివారం జెర్రి రావడంతో కలకలం రేగింది. యూనివర్సిటీలో ఇటీవల తరచుగా రిఫ్రిజిరేటర్‌లో కప్పలు, పురుగులు రావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రిఫ్రిరేజిరేటర్ పాడైపోయినా దానన్ని మార్చకుండా ఉపయోగించడంతో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వసస్తోందని ఏబీవీపీ నాయకులు ఆందోళన చేశారు. జెర్రి ఉన్న రిఫ్రిరేజిరేటర్‌ను అక్కడి నుంచి తీసుకుపోయి బయట పడేశారు. విద్యార్థులంతా పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో హాస్టర్ డైరెక్టర్ రమేష్ వారికి సర్దిచెప్పారు. కొత్త రిఫ్రిజిరేటర్ కొనుగోలు చేసి విద్యార్థులకు నాణ్యమైన తాగునీరు అందించాలని ఏబీవీపీ ఎంజీయూ అధ్యక్షుడు హనుమాన్ డిమాండ్ చేశారు.
ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
భువనగిరిటౌన్ : గీత కార్మికులకు రావాల్సిన ఎక్స్‌గ్రేషియా నిధులు విడుదల చేయాలని కేజీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొలగాని జయ రాములు డిమాండ్ చేశారు. శనివారం భువనగిరి పట్టణంలోని ఫంక్షన్ హాల్‌లో సంఘం జిల్లా అధ్యక్షుడు రాగీరు కృష్ణయ్య అధ్యక్షతన కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాలు కల్లుగీత కార్మికులను ఓటు బ్యాంకుగా చూడకుండా వారి సంక్షేమానికి బడ్జెట్లో రూ.5వేల కోట్లు కేటాయించాలన్నారు. ఈ నెల 17న ఇందిరా పార్క్ వద్ద రాష్ట్ర కమిటీ సభ్యుల సామూహిక నిరాహార దీక్ష కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.


