ప్రేమికుల రోజున విషాదం
మోటకొండూర్: మైనర్ బాలిక, యువకుడు ప్రేమించుకున్నారు. ఇరువురి తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపంతో ఈ నెల 6వ తేదీన ఇద్దరు పురుగుల మందు తాగగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ప్రేమికుల దినోత్సవం రోజునే యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన మోటకొండూర్ మండలం తేర్యాలలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తేర్యాల గ్రామానికి చెందిన వరికుప్పల రాకేష్(21) ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. రాకేష్ అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను ప్రేమించాడు. ఈ విషయం బాలిక కుటుంబ సభ్యులకు తెలియడంతో ఇద్దరినీ మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన రాకేష్, బాలిక ఈ నెల 6న నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం రాళ్లవాగుతండాలోని గుట్ట వద్దకు వెళ్లి పురుగుల మందు తాగారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన వారిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వారిద్దరిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ రాకేష్ శనివారం ఉదయం మృతిచెందాడు. బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎస్‌ఐ అశోక్ తెలిపారు.
తల్లిదండ్రులు మందలించారని ఈ నెల 6న పురుగుల మందు తాగిన ప్రేమ జంట
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ
యువకుడు మృతి
మైనర్ బాలిక పరిస్థితి విషమం


