పాలకవర్గం మొత్తం కొత్తవారే..
ఆలేరు మున్సిపాలిటీలో 12 మంది తొలిసారి విజయం
ఆలేరు : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీలో గెలిచిన అభ్యర్థులందరూ కొత్త వారే. మొత్తం 12 వార్డుల్లో అందరూ మొదటిసారి విజయం సాధించిన వారే. కొందరు తొలి ప్రయత్నంలో, మరికొందరు రెండో ప్రయత్నంలో విజయాన్ని అందుకున్నారు. ఇందులో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలకు చెందిన అభ్యర్థులు ఉన్నారు.
చండూరులో పదికి పది కొత్త ముఖాలే..
చండూరు : నల్లగొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ పాలకవర్గం మొత్తం కొత్త వారితోనే కొలువుతీరనుంది. మున్సిపాలిటీలోని పది వార్డులకు గాను అన్నింట్లో కొత్తవారే ఎన్నికయ్యారు. ఈ పది మందిలో ముగ్గురు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలై.. ఈసారి ఎన్నికల్లో విజయం సాధించారు. మిగతా ఏడుగురు ఈ ఎన్నికల్లోనే మొదటిసారి పోటీ చేసి విజయం సాధించారు. అయితే అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి పది వార్డుల్లో 18 మంది పోటీ చేయగా.. అందులో 11 మంది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే తెర మీదకు రావడం విశేషం.
27 ఏళ్లకే కౌన్సిలర్‌గా విజయం
చండూరు: చండూరు మున్సిపాలిటీలో 5వ వార్డు నుంచి 27 ఏళ్ల యువకుడు కౌన్సిలర్‌గా గెలుపొందాడు. 5వ వార్డు ఎస్టీ జనరల్‌కు రిజర్వు కావడంతో కొన్రెడ్డి మధు బీఆర్‌ఎస్ తరఫున బరిలో నిలిచాడు. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన మధు కాంగ్రెస్ ప్రభంజనంలో కూడా తన సమీప ప్రత్యర్థిపై 358 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు.
తల్లి పారిశుద్ధ్య కార్మికురాలు..
కుమారుడు కౌన్సిలర్
చండూరు : తల్లి పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న మున్సిపాలిటీలోనే కుమారుడు కౌన్సిలర్‌గా గెలుపొందాడు. నల్లగొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ 2వ వార్డులో కాంగ్రెస్ నుంచి 30 ఏళ్ల బుషిపాక వాసు 51 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. వాసు తల్లి ఎల్లమ్మ చండూరు మున్సిపాలిటీలోనే పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. వాసుకు ఐదేళ్ల వయస్సులో అతడి తండ్రి భిక్షమయ్య మృతిచెందగా.. అప్పట్లో చండూరు గ్రామ పంచాయతీలో, ఇప్పుడు మున్సిపాలిటీలో అతడి తల్లి ఎల్లమ్మ పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తూ వస్తోంది. వాసు డిగ్రీ చదువు మధ్యలోనే ఆపి చిన్నచిన్న పనులు చేస్తూ తల్లికి చేదోడువాదోడుగా ఉంటూ వచ్చాడు. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో అనూహ్యంగా కౌన్సిలర్‌గా పోటీచేసి విజయం సాధించాడు.
పాలకవర్గం మొత్తం కొత్తవారే..


