కారు ఢీకొని వ్యక్తి, ఐదు మేకలు మృతి
తుంగతుర్తి : కారు ఢీకొని వ్యక్తితో పాటు ఐదు మేకలు మృతిచెందాయి. ఈ ఘటన తుంగతుర్తి మండలం కొత్తగూడెం టోల్‌గేట్ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన విరాల ప్రకారం.. తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన కంచం వీరన్న(40) తన వ్యవసాయ క్షేత్రానికి మేకలను తోలుకొని వెళ్తుండగా.. అదే సమయంలో మద్దిరాల నుంచి హైదరాబాద్ వైపు కారులో వెళ్తున్న జస్వాల్ నిశాన్ అతివేగంగా వచ్చి కొత్తగూడెం టోల్‌గేట్ సమీపంలో వీరన్నతో పాటు మేకలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వీరన్నకు తీవ్ర గాయాలయ్యాయి. ఐదు మేకలు మృతిచెందగా.. మరో మూడు మేకలకు గాయాలయ్యాయి. వీరన్నను చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషయంగా ఉండడంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి రిమాండ్
భువనగిరి : మండలంలోని పెంచికల్‌పహాడ్ గ్రామంలో మంగళవారం చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన అదే గ్రామానికి చెందిన సిలువేరు ఎల్లయ్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించనట్లు బుధవారం పోలీసులు తెలిపారు. కాగా ఎల్లయ్య నివాసానికి మంగళవారం చిన్నారి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో నిప్పు పెట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే గ్రామానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్‌ఐ అనిల్‌కుమార్ తెలిపారు.
మాంజా నుంచి తప్పించుకోవడం ఇలా..
మాడుగులపల్లి : సంక్రాంతి సందర్భంగా కొందరు చైనా మాంజాతో పతంగులు ఎగురవేస్తూ మనుషులు, పక్షుల ప్రాణాలను తీస్తున్నారు. అయితే చైనా మాంజా నుంచి తప్పించుకోవడానికి ఓ వ్యక్తి వినూత్న ఆలోచన చేశాడు. బుధవారం నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండల కేంద్రంలోని టోల్‌గేట్ వద్ద వాహనాల తనిఖీలు చేస్తున్న పోలీసులకు.. ద్విచక్ర వాహనంపై గుంటూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న రసూల్ అనే వ్యక్తి హెల్మెట్‌కు, షర్ట్ బటన్‌కు మధ్య కర్చీఫ్‌ను రక్షణ కవచంలా కట్టుకోని కనిపించాడు. ఎందుకిలా కట్టుకున్నావని పోలీసులు రసూల్‌ను ఆరా తీయగా.. మాంజా దారం గొంతుకు తగలకుండా ఉండేందుకు ఇలా కట్టుకున్నట్లు చెప్పాడు. చైనా మాంజా తగలకుండా తీసుకున్న జాగ్రత్తల పట్ల రసూల్‌ను ఎస్‌ఐ కృష్ణయ్య, పోలీసు సిబ్బంది అభినందించారు. ఇతర వాహనదారులు కూడా చైనా మాంజా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


