యాదగిరి క్షేత్రంలో లక్ష పుష్పార్చన పూజలు
యాదగిరిగుట్ట: ఏకాదశిని పురస్కరించుకొని బుధవారం యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో లక్ష పుష్పార్చన పూజలను ఆలయ అర్చకులు నిర్వహించారు. ఆలయాన్ని వేకువజామునే తెరిచిన అర్చకులు సుప్రభాతం, అభిషేకం, సహస్ర నామార్చన వంటి పూజలు జరిపించారు. అనంతరం ముఖ మండపంలోని సువర్ణ పుష్పార్చన మూర్తులకు పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా లక్ష పుష్పార్చన పూజలు చేపట్టారు. రంగు రంగుల పూలతో ఉత్సవమూర్తులకు వేద మంత్రాలతో పుష్పార్చన పూజను చేసి, శ్రీస్వామి అమ్మవార్లకు హారతిని నివేదించారు. ఈ వేడుకల్లో ఆలయ అర్చకులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. ఇక ఆలయంలో నిత్య పూజలు సంప్రదాయంగా కొనసాగించారు.


