అనుబంధం, ఆత్మీయత.. అంతా ఒక బూటకం

Old Woman Was Kicked Out Of Her House For Having Leprosy - Sakshi

కుష్ఠు రోగి అని బహిష్కరణ

పైపు గొట్టంలో తలదాచుకుంటున్న వృద్ధురాలు

అధికారులు పట్టించుకోవాలని విజ్ఞుల విన్నపం 

సాక్షి, ఒడిశా: కుష్ఠు వ్యాధి ఒకప్పుడు భయంకరమైనది. అయితే కుష్ఠు వ్యాధికి మందులు వచ్చిన తరువాత అది ప్రమాదకరమైన వ్యాధి కాదని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్లు, ప్రభుత్వం చెబుతూనే ఉన్నా నేటికీ అనేక మంది కుష్ఠు వ్యాధి గ్రస్తులను అంటరాని వారిగానే పరిగణిస్తున్నారు. వారిని చూస్తే అసహ్యించుకుంటున్నారు. ఆఖరికి రక్త సంబంధీకులే వారిని దూరంగా నెడుతున్నారు. అలా కుటుంబ సభ్యులు వెళ్లగొట్టిన ఒక వృద్ధురాలు దిక్కుతోచని స్థితిలో ఒక కాలువ పక్కన సిమెంట్‌ పైపు గొట్టంలో తల దాచుకుంటూ దుర్భర జీవితం గడుపుతోంది. నవరంగపూర్‌ జిల్లా నందాహండి సమితి విమాలిగుడ గ్రామంలో ఈ పరిస్థితి కనిపించింది. గ్రామానికి చెందిన కమల బిశాయి(55)కి కుష్ఠు వ్యాధి ఉందని వైద్యులు వెల్లడించారు. మందులు వాడితే నయమవుతుందని తెలిపారు.

అయితే కుష్ఠు వ్యాధి అంటే మహమ్మారి అని అది తమకు కూడా సోకవచ్చన్న భయంతో ఆమె ఇంటివారు మానవత్వాన్ని మరిచి ఇంటినుంచి వెళ్లగొట్టారు. ఏడాది కిందట ఆమె భర్త మరణించాడు. అందుచేత ఆమె తన కొడుకు, కోడలు వద్ద ఉంటోంది. ఆమె కాలివేలికి కురుపై కాలక్రమేణా పెద్దది కావడంతో హాస్పిటల్‌కు వెళ్లగా ఆమెకు కుష్ఠు వ్యాధి సోకిందని డాక్టర్లు వెల్లడించారు. దీంతో ఆమె బందువులు, గ్రామస్తులు అంటరాని దానిగా చూడడం మొదలుపెట్టారు. ఆఖరికి కన్న కుమారుడు, కోడలు కూడా ఆమెను అంటరానిదిగా చూసి ఇంటి నుంచి బయటకు పంపివేశారు. గ్రామంలో నిన్నటి వరకు ఎంతో ఆదరంగా చూసిన  ప్రజలు, చుట్టుపక్కల వారు,    బంధువులు, మిత్రులు, ఆఖరికి కన్నకొడుకు, కోడలు తనను చీదరించుకుంటూ దరి చేరనీయక పోవడంతో ఆ వృద్ధురాలు   ఖిన్నురాలైంది. ఆఖరికి ఆమెకు తిండి కూడా పెట్టేవారు లేక  పోయారు. నిలువ నీడ లేని కమల బిశాయి సమీప కాలువ వద్ద గల పాడైన ఒక సిమ్మెంట్‌ పైపులో తల దాచుకుంటోంది.   (ఒంటిపై చీర‌లు తీసి ప్రాణాలు కాపాడారు)

రేషన్‌ బియ్యమే ఆధారం
ఎండావానలకు ఆమె ఆపైపునే ఇంటిగా  భావిస్తూ అందరికీ దూరంగా ఒంటరిగా ఉంటోంది. తనకు ఉన్న రేషన్‌ కార్డు ద్వారా ప్రభుత్వం ఇచ్చే బియ్యమే జీవనాధారం. ఆమె పగలు తిరుగుతూ సాయంత్రం పైపు వద్దకు చేరుకుంటూ పైపులో తల దాచుకుంటోంది. ఈ విషయం పంచాయతీ అధికారులకు తెలిసినా వారిలో మానవత్వం నిద్ర లేవడం లేదని  ప్రజలు విమర్శిస్తున్నారు. కుష్ఠు వ్యాధి నేడు అంటరాని వ్యాధి కాదని అధికారులు ప్రకటనలు చేస్తున్నా అటువంటి వారికి ఉచిత  మందులు ఇచ్చి సేవలు చేస్తున్న లెప్రా ఇండియా లాంటి సంస్థలు ఉన్నా కమల బిశాయి లాంటి అభాగ్యులను నేటికీ సమాజానికి దూరంగా నెట్టేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆమెకు తగిన రక్షణ కల్పించి వైద్యం తో పాటు పునరావాసం కల్పించాలని విజ్ఞులు అభిప్రాయ పడుతున్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top