ఇరకాటంలో గ్రామ సచివాలయ ఉద్యోగులు
వరుస సర్వేలు, పనులతో ఉక్కిరిబిక్కిరి
హౌస్ హోల్డర్స్‌కూ ఇబ్బందికరమైన పరిస్థితులు
ప్రతి సర్వేకు ఓటీపీలు చెప్పాల్సిన పరిస్థితి
ఓటీపీలు తీసుకోవడమే తప్ప సంక్షేమ పథకాల్లేవంటున్న ప్రజలు
సర్కారు చెలగాటం
ఒక సర్వే పూర్తయిన వెంటనే మరొకటి.. అదయ్యాక ఇంకొకటి.. అంటూ సచివాలయ ఉద్యోగులను ఊరంతా తిప్పిస్తున్నారు. ఇతర శాఖల బాధ్యతలు కూడా సచివాలయాల ఉద్యోగులకే అప్పగిస్తున్నారు. ఉద్యోగం చేయలేక, మాను కోలేక తీవ్ర మానసిక ఆవేదనకు గురవుతున్నా రు. పని ఒత్తిడి ఎక్కువై అనారోగ్యానికి గురవుతున్నారు. గత కొంతకాలంగా ఈ తరహా మానసిక క్షోభతో 70మందికి పైగా సిబ్బంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పని గంటలు కూడా ఇతిమిద్ధంగా లేకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఎంఏ, ఎంఈడీ, ఎంటెక్‌లు తదితర ఉన్నత చదువులు చదివి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలా? అని ఆవేదన చెందుతున్నారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :
విపరీతమైన పని ఒత్తిడి.. అంతకుమించి మానసిక ఒత్తిడితో సచివాలయ ఉద్యోగులు చిత్తయిపోతున్నారు. పేరుకు ప్రభుత్వ ఉద్యోగులే గానీ సర్కారు పెడుతున్న క్షోభతో వీరు విసిగిపోతున్నారు. తీవ్ర పని ఒత్తిడి, ఉన్నతాధికారుల వేధింపుల కారణంగా సచివాలయాలు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంకోవైపు సర్వేల పేరు తో వచ్చి ఓటీపీలు అడగడమే తప్ప సంక్షేమ పథ కాలు రావడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. ఓటీపీలు తప్ప సంక్షేమం ఎక్కడని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకోలేక, ప్రభుత్వం అప్పగించిన బాద్యతలు పూర్తి చేసేందుకు సహకారం లేక నరకయాతన అనుభవిస్తున్నారు.
సచివాలయ ఉద్యోగుల దీన స్థితి ఒక వైపైతే.. రెండో కోణం చూస్తే ప్రజలది. ముఖ్యంగా లబ్ధిదారులది. రకారకాల సర్వేలతో సచివాలయ ఉద్యోగులు ఇళ్లకు వస్తున్నారు. తరచూ వివరాలు అడుగుతున్నా రు. యాప్‌ల్లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఆన్‌లైన్ చేశాక ఓటీపీలు పంపిస్తున్నారు. ఆ ఓటీపీలు తిరిగి హౌస్ హోల్డర్స్ చెప్పాల్సి వస్తోంది. అయితే ఎన్ని ఓటీపీలు చెప్పినా.. ఆ మేరకు లబ్ధి కనిపించకపోవడంతో అంతా విస్తుపోతున్నారు. దీనికి తోడు సాంకేతిక సమస్యలు రావడం, వివరాలు మళ్లీ అడగడం, జనరేట్ చేశాక వచ్చాక ఓటీపీలను మళ్లీ అడగడం, హౌస్ హోల్డర్స్ చెప్పడం నిరంతర ప్రక్రియగా మారిపోయింది. సంక్షేమ పథకాల కోసం వివరాలు సేకరిస్తున్నామని చెబుతున్నారే గానీ.. పథకాలు మాత్రం రావడం లేదు. ఒక పథకం కోసం అనేక పర్యాయాలు వచ్చి వివరాలు సేకరిస్తూ ఓటీపీలు తీసుకుంటున్నా.. ఖాతాలో రూపాయి కూడా పడ డం లేదు. వరుస సర్వేలకు సమాధానాలు చెప్పలేక.. కొంతమందైతే ఎందుకు చెప్పాలి.. ఏం చేస్తార ని చెప్పాలి అంటూ ఎదురు తిరిగి సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఒకవైపు పనులు పూర్తి చేయాలని ఉన్నతాధికారుల ఒత్తిళ్లు, వేధింపులు.. మరోవైపు క్షేత్రస్థాయిలో ప్రతికూల పరిస్థితులు వెరసి సచివాలయం ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఆఖరుకు సెలవులు కూడా ఇవ్వని దీన స్థితి నెలకొంది.


