అసమానతలు ఉన్నంత కాలం ఉద్యమాలు ఆగవు | - | Sakshi
Sakshi News home page

అసమానతలు ఉన్నంత కాలం ఉద్యమాలు ఆగవు

Mar 22 2026 2:06 AM | Updated on Mar 22 2026 2:06 AM

సీపీఐఎంఎల్‌ న్యూ డెమొక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్‌

కోమర్తిలో అప్పలసూరి 29వ వర్ధంతి సభ

నరసన్నపేట: భారత విప్లవోద్యమంపైన ఆరు దశాబ్దాలుగా పాలకులు అనేక నిర్బంధాలను ప్రయోగిస్తున్నారని, అరెస్టులు అక్రమ నిర్బంధాలతో విప్లవోద్యమాన్ని ఆపలేరని, అసమానతలు ఉన్న చోట ఉద్యమాలు సహజమని సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమొక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్‌ అన్నారు. నరసన్నపేట మండలం కోమర్తి అమరవీరుల స్థూపం వద్ద మామిడి అప్పలసూరి 29వ వర్థంతితో పాటు కోమర్తి అమరులకు నివాళి అర్పించే కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాష్‌ మాట్లాడుతూ ఆపరేషన్‌ కగార్‌ పేరుతో మావోయిజం అంతమైందని పాలకులు చెప్పుకుంటున్నా.. సమాజంలో అసమానతలు ఉన్నంత కాలం విప్లవోద్యమాన్ని అనచటం ఎవరి తరమూ కాదన్నారు. ఒక్కో సందర్భంలో పోరాటం సాయుధ రూపం సైతం తీసుకుంటుందని, నిత్య జీవన సంఘర్షణ నుంచి ప్రతిఘటనా పోరాటాలు సాగుతాయని చెప్పారు. అఖిత భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంకల మాధవరావు మాట్లాడుతూ సామ్రాజ్యవాద యుద్ధోన్మాదం పెచ్చుమీరుతోందని, ఎందరో అమాయకులు వారి పంతాలకు ప్రాణాలు కోల్పోతున్నారని, మరెందరో అభాగ్యులుగా మిగిలి పోతున్నారని, వీటికి కారకులైన వారిని ప్రధాని మోదీ వెంటేసుకు రావడం సరికాదన్నారు. సీనియర్‌ నాయకులు అప్పయ్య, ఐఎఫ్‌టీయూ జిల్లా నాయకులు కృష్ణవేణి మాట్లాడుతూ అమరుల త్యాగాలు వృథాగా పోనీయకూడదని, వారి ఆశయాల సాధనకు నేటి తరం ప్రజలను ఏకం చేయాల్సి అవసరం ఉందన్నారు. అప్పలసూరి లాంటి నాయకులు చూపిన పోరాట స్ఫూర్తి ఎందరికో ఆదర్శమన్నారు. కార్యక్రమంలో న్యూ డెమొక్రసీ జిల్లా కమిటీ సభ్యులు నేతింటి నీలం రాజు, జిల్లా నాయకులు బగ్గు భాస్కరరావు, గ్రామ కమిటీ ప్రతినిధులు కొల్లి చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement