● రాత్రివేళ ఎందుకు తిరుగుతున్నావంటూ బంధువును ప్రశ్నించిన టీడీపీ కార్యాలయ మేనేజర్
● వాగ్వాదానికి దిగిన మరో యువకుడు
● తోపులాటలో గాయపడి మేనేజర్ మృతి
● నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
శ్రీకాకుళం : జిల్లా కేంద్రంలోని మండలవీధిలో గురువారం రాత్రి ఇరు వర్గాల మధ్య జరిగిన చిన్నపాటి వివాదం ఓ యువకుడి మరణానికి దారితీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలవీధిలో నివాసముంటున్న గొర్లె మోహన్‌కృష్ణ (32) గురువారం రాత్రి అదే వీధిలో ఆరుబయట కూర్చున్నాడు. ఈ సమయంలో తన బంధువు కొందరు యువకులతో తిరుగుతూ కనిపించాడు. ఈ రాత్రి వేళ వీరితో ఎందుకు తిరుగుతున్నావని మోహన్‌కృష్ణ ప్రశ్నించాడు. ఇదే సమయంలో అటుగా వస్తున్న మహాలక్ష్మినగర్ కాలనీకి చెందిన గడ్డి మనోహర్ అనే యువకుడు మోహన్‌కృష్ణతో వాగ్వాదానికి దిగాడు. తమ వీధి వారితో తిరిగితే తప్పేంటని ప్రశ్నించగా ఈ క్రమంలో ఇద్దరి మధ్య తోపులాట చోటుచేసుకుంది. మనోహర్ నెట్టేయడంతో మోహన్‌కృష్ణ తలకు గాయమైంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిందితుడిని ఒకటో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బంధువులు ఏం చెబుతున్నారంటే..
మోహన్‌కృష్ణపై నలుగురు దాడి చేశారని బంధువులు చెబుతున్నారు. దాడి జరిగిన సందర్భంలో మోహన్‌కృష్ణ బంధువు కూడా అక్కడే ఉన్నా అతను నోరు మెదపకపోవడానికి కారణాలను కూడా కొందరు అనుమానిస్తున్నారు. ఆ ప్రాంతంలో తరచూ గంజాయి బ్యాచ్ తిరుగుతుంటారని, ఇది కూడా వారి పనేమోనన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
విషాదంలో కుటుంబ సభ్యులు..
మోహన్‌కృష్ణ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. గతంలో ఇతని తండ్రి వెంకటరమణ పార్టీ కార్యాలయ పనులన్నీ చూసేవారు. రెండేళ్ల క్రితం గుండెపోటుతో మృతి చెందడంతో మోహనకృష్ణకు బాధ్యతలు అప్పగించారు. మోహనకృష్ణ సోదరికి వివాహం కాగా, తల్లి లక్ష్మితో కలిసి మండల వీధిలో నివాసం ఉంటున్నాడు.
రక్షణ ఏదీ?
ఇటీవల కాలంలో శ్రీకాకుళం నగరంలో హత్యలు పెరిగిపోతున్నాయి. కొద్దిరోజుల క్రితమే 80 అడుగుల రోడ్డులో మోహన్ అనే యువకుడ్ని హత్య చేయగా, ఇప్పుడు మోహనకృష్ణ మృత్యువాత పడటం గమనార్హం.


