చెక్‌..! | - | Sakshi
Sakshi News home page

చెక్‌..!

Mar 17 2026 7:22 AM | Updated on Mar 17 2026 7:22 AM

సర్వైకల్‌ క్యాన్సర్‌కు

14–15 ఏళ్ల బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ టీకా

జిల్లాలో 14,036 మంది గుర్తింపు

మందకొడిగా వ్యాక్సినేషన్‌

నరసన్నపేట: ప్రపంచాన్ని కలవరపెడుతున్న అతిపెద్ద అనారోగ్య భూతం క్యాన్సర్‌. క్యాన్సర్‌ అనేది మహిళలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తూ వారికి పెద్ద శాపంగా మారింది. అందులో గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌ ఒకటి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ వలన వస్తుంది. ఈ వైరస్‌ను నివారించడానికి హెచ్‌పీవీ అనే టీకాను తయారు చేశారు. ఈ వ్యాక్సిన్‌ తీసుకోవడం ద్వారా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను పూర్తిగా నివారించవచ్చు. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ కేవలం సర్వైకల్‌ క్యాన్సర్‌ను మాత్రమే కాకుండా.. వైజనల్‌ క్యాన్సర్‌తో పాటు మరో మూడు క్యాన్సర్లను కూడా నివారిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. 14–15 ఏళ్ల బాలికలను ఉచితంగా ఈ టీకాను అందించేందుకు కేంద్రం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్యాన్సర్‌కు కారణమయ్యే హెచ్‌పీవీ టైప్‌ 16, 18తో పాటు టైప్‌ 6, 11 రకాల నుంచి ఇది రక్షణ కల్పిస్తుందని ఆరోగ్య శాఖ అధికారులు వివరిస్తున్నారు. ఒక డోస్‌ వ్యాక్సిన్‌ అందించడం వల్ల బాలికలకు సంబంధిత వైరస్‌ నుంచి దీర్ఘకాలిక రక్షణ కల్పించబడుతుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో 14,036 మందిని టీకాకు అర్హులుగా గుర్తించారు. ఇప్పటికే జిల్లాలో ఈ టీకా పంపిణీ ప్రారంభం కాగా.. మూడు రోజుల నుంచి పీహెచ్‌సీల పరిధిలో కూడా వ్యాక్సినేషన్‌ జరుగుతోంది. కాగా ఈ వ్యాక్సిన్‌పై ఎటువంటి అపపోహలు, భయాలు పెట్టుకోవద్దని, 14 నుంచి 15 ఏళ్ల లోపు బాలికలకు ఈ టీకాను తప్పనిసరిగా వేయించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్‌

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ 14–15 ఏళ్ల బాలికలకు ఉచితంగా అందిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ మేరకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని సూచించింది. దీంట్లో భాగంగా 14–15 ఏళ్ల బాలికలకు గుర్తించారు. అయితే వ్యాక్సినేషన్‌పై బాలికలు, వారి తల్లిదండ్రులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించలేదనే విమర్శలు వస్తున్నాయి. దీంతో అర్హలైన బాలికలను గుర్తించినా వారు ముందుకు వచ్చేందుకు నిరాశక్తత చూపుతున్నారు. దీనికి కారణం సరైన పద్ధతిలో అవగాహన కల్పించకపోవడమేనని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం 9 వ తరగతి చదువుతూ ఉన్న బాలికలను గుర్తించి టీకా వేస్తున్నారు. నరసన్నపేట మండలంలో ఉన్న మాకివలస, ఉర్లాం పీహెచ్‌సీల్లో ఇప్పటివరకు 34 మంది బాలికలకు వ్యాక్సినేషన్‌ చేశారు.

సద్వినియోగం చేసుకోవాలి

మాకివలస పీహెచ్‌సీలో 290 మందిని గుర్తించాం. రెండు రోజుల్లో 24 మందికి వ్యాక్సినేషన్‌ వేశాం. ఈ మేరకు బాలికలకు పూర్తిగా అవగాహన కలిగిస్తున్నాం. ఏప్రిల్‌ నుంచి బాలికల్లో మరింతగా అవగాహన పెరగవ చ్చు. 14–15 ఏళ్ల బాలికలు అపోహలకు పోకుండా ఈ వ్యాక్సినేషన్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. – విజయకుమార్‌, వైద్యాధికారి, మాకివలస

టీకా వేయించుకోవాలి

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌తో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ పూర్తిగా నివారించవచ్చు. 14–15 ఏళ్లలోపు బాలికలకు మాత్రమే ప్రస్తుతం ఈ టీకా వేయడం జరుగుతుంది. దీనివలన ఎటువంటి సైడ్‌ ఎఫెక్టులు ఉండవు. ఆయా వయసు కలిగిన బాలికలు ముందుకు రావాలి. అలాగే వారి తల్లిదండ్రులు కూడా బాలికలకు ప్రోత్సహించాలి. జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని పీహెచ్‌సీల్లో ఈ వ్యాక్సినేషన్‌ చేయడం జరుగుతోంది. అలాగే వైద్య శాఖ సిబ్బంది గ్రామాల్లో బాలికలు, తల్లిదండ్రులకు అవగాహన కలిగిస్తున్నారు. – తాడేల శ్రీకాంత్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో

టీకా కొత్తదేమీ కాదు

2008 నుంచే ఈ టీకా అందుబాటులో ఉంది. సీ్త్రల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నివారణకు ఉపయోగిస్తున్న హెచ్‌పీవీ టీకాను కొత్తగా ప్రవేశపెట్టారని, ఇది ఎలా పనిచేస్తుందో అనే కొత్త భయం బాలికల తల్లిదండ్రుల్లో నెలకొంది. అయితే ఈ టీకా కొత్తగా ప్రవేశపెట్టింది కాదనే విషయం చాలా మందికి తెలియదు. 2008 నుంచే ఈ టీకా అందుబా టులో ఉంది. పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ టీకా రూ.15 వేలు చెల్లించి మహిళలు వేయించుకుంటున్నారు. అయితే గర్భాశయ క్యాన్సర్‌ అవగాహన ఉన్నవారు, డబ్బున్న వారే హెచ్‌పీవీ టీకాను వేయించుకుంటున్నారు. ఇప్పుడు ఉచితంగా అందుబాటులోనికి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement