పక్షుల కేంద్రానికి టికెట్
టెక్కలి: టెక్కలి మండలం తేలినీలాపురం గ్రామంలో పెలికాన్, పెయింటెడ్ స్టార్క్ తదితర విదేశీ పక్షుల విడిది కేంద్రానికి ఇకపై వెళ్లాలంటే టికెట్ తీసుకోవాల్సిందే. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ పక్షుల కేంద్రంలో గతంలో ఎన్నడూ టికెట్ వసూలు అనేది ఉండేది కాదు. ఇప్పుడు కొత్తగా ఒక్కో వ్యక్తి నుంచి రూ.10 వసూలు చేస్తున్నారు. పక్షుల కేంద్రంలో అభివృద్ధి కోసమే టికెట్ విధానం అమలు చేసినట్లు అటవీ శాఖాధికారులు చెబుతుండగా, పక్షుల కేంద్రం అభివృద్ధికి పర్యాటకుల నుంచి టికెట్ రూపంలో వచ్చిన నిధులను వెచ్చిస్తారా అంటూ కొంత మంది పర్యాటకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
‘పెండింగ్ ప్రాజెక్టుల సంగతేంటి..?’
టెక్కలి: జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్న హామీని ఎప్పటిలోగా నెరవేరుస్తారని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కమిటీ సభ్యుడు నంబూరు షణ్ముఖరావు ప్రశ్నించారు. ఆదివారం టెక్కలి సీఐ టీయూ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. రూ.600 కోట్లు కేటాయిస్తే, జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయవచ్చునని పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు కె.రామ్మోహన్‌నాయుడు, కె.అచ్చెన్నాయుడు చిత్తశుద్ధిగా వ్యవహరించాలన్నారు. ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ మంత్రి ఎందుకు నిధులు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. వంశధార లిఫ్ట్ కు రూ.150 కోట్లు, రిజర్వాయర్ పనుల కోసం రూ.150 కోట్లు, అదేవిధంగా ఆఫ్‌షోర్‌కు రూ. 300 కోట్లు కేటాయిస్తే శివారు వరకు నీరు అందుతుందని తెలిపారు. గొప్పలు చెప్పుకోవడం కాదని నేరడికి అనుకూలంగా తీర్పు వచ్చినా గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు వేయించుకోలేకపోతున్నారని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడిని ప్రశ్నించారు.
పక్షుల కేంద్రానికి టికెట్


