పుస్తకం
పిలుస్తోంది
● నేటి నుంచి సిక్కోలు పుస్తక మహోత్సవం
● వంద ప్రచురణకర్తల పుస్తకాల ప్రదర్శన
● ప్రతి రోజూ సాంస్కృతిక ప్రదర్శనలు
శ్రీకాకుళం కల్చరల్: జిల్లా కేంద్రంలో సిక్కోలు పుస్తక మహోత్సవం మంగళవారం నుంచి 20వ తేదీ వరకు జరగనుంది. ఇందుకోసం మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్‌లో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. 100 మంది ప్రముఖ పుస్తక ప్రచురణకర్తల వేలాది పుస్తకాల ప్రదర్శన కోసం ఏర్పాట్లు చేశారు. ప్రతి రోజూ పుస్తకావిష్కరణలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి.
పది రోజులపాటు జరిగే ఈ ఉత్సవంలో ప్రతి రోజు సాయంత్రం నాలుగు గంటలకు సాహిత్య, సాంస్కృతిక, వైజ్ఞానిక కార్యక్రమాలు రాత్రి 10 గంటల వరకు ఉంటాయి. జిల్లాకు ప్రత్యేకమైన కళారూపాలైన తప్పెటగుళ్లు, కోలాటం, జముకుల పా ట, ఎరుకల పాట, శాసీ్త్రయ నృత్యాలు, ఏకపాత్రాభినయాలు, నాటికలు, సినీ సంగీత విభావరులు, సంగీత వాయిద్య విన్యాసాలతో సిక్కోలు పుస్తక మహోత్సవంలో ప్రజలకు వినోదాన్ని పంచను న్నాయి. అదేవిధంగా ఇంజినీరింగ్ మెడిసిన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు, జూనియర్ కాలేజీ, ఉన్నత పాఠశాలల విద్యార్థులతో సైన్స్ ప్రయోగాలు, ప్రదర్శనలు ఉంటాయి. శ్రీకాకుళం జన విజ్ఞాన వేదిక వారు కూడా ప్రదర్శనలు నిర్వహించనున్నారు.
● 11న గంటేడ గౌరు నాయుడు రచించిన ‘నదికీ ఓ భాష ఉంది’, రచయిత సిరికి స్వామి నాయుడు రచించిన ‘శతర’ పుస్తక ఆవిష్కరణ, కవి సమ్మేళనం ఉంటుంది.
● 12న కూన రంగనాయకులు రచించిన‘ ఆఖరిమెట్టు’, ‘కూన కథలు’ అనే రెండు పుస్తకాలు ఆవిష్కరిస్తారు.
● 13న బాల సుధాకర్ మౌళి రచించిన ‘గాలి బోత’, రచయిత రౌతు వాసుదేవరావు రచించిన ‘తూరుపు కొండల్లో మెరిసిన మేరంగి’ పుస్తక ఆవిష్కరణ, అనంతరం కవి సమ్మేళనం ఉంటుంది.
● 14న మజ్జి భారతి రచించిన ‘జీవన గానం’ పుస్తక ఆవిష్కరణ, ప్రముఖ రచయితలు అట్టాడ అప్పలనాయుడు, గంటేడ గౌరునాయుడు రచించిన ‘సంకలనం’ పుస్తక పరిచయం ఉంటుంది. అనంతరం కవి సమ్మేళనం ఉంటుంది.
● 15న లండ సాంబమూర్తి రచించిన ‘ఆమెకు మిగలనై ఆమె’, రచయిత పాయల మురళీకృష్ణ రచించిన ’గచ్చంశెట్టికి అటు ఇటు’ సంకలన పుస్తక ఆవి ష్కరణ, అనంతరం కవిసమ్మేళనం ఉంటుంది.
● 16న బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ వీసీ రచించిన ‘పెయిన్స్–గెయిన్స్’, మల్లిపురం జగదీష్ రచించిన ‘అడవి పూల దారిలో మన్నెం ముచ్చట్లు’ పుస్తకావిష్కరణ ఉంటుంది.
● 17న కె.ఉదయ్ కిరణ్ రచించిన ‘కాకి చొక్కా’, రచయిత మామిడి కోదండరావు రచించిన ‘వర్త మానం నుంచి గతం వైపు’ పుస్తకావిష్కరణలు ఉంటాయి.
● 18న ప్రొఫెసర్ కెఎస్ చలం ఆధ్వర్యంలో దక్షిణాదిన సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్ పుస్తకావిష్కరణ, బాల సుధాకర్ మౌళి రచించిన ‘సందువ’, ‘దేశంలో లోపల యుద్ధం’, మండా శ్రీనివాసరావు రచించిన లయతరంగం పుస్తకాల ఆవిష్కరణలు ఉంటాయి.
● 19న రచయిత కుత్తుం వినోద్ రచించిన ‘స్వాతంత్య్రోద్యమంలో సిక్కోలు వీరులు’, అరుణ్ భవేర రచించిన ‘ఇలాంటి ఓ ప్రయాణం’, మండ శ్రీనివాసరావు రచించిన ‘కళాపూర్ణోదయంలో లయ తరంగం’ పుస్తక ఆవిష్కరణ ఉంటాయి.
● 20న రచయిత మొయిద శ్రీనివాసరావు రచించిన ‘కరవాక’, ఎల్ ఎన్ కొల్లి రచించిన ‘ఎకోస్ అండ్ ఎంబర్స్‘ పుస్తక ఆవిష్కరణ, అనంతరం కవి సమ్మేళనం ఉంటుంది.
మొదటిసారిగా నిర్వహిస్తున్నాం
శ్రీకాకుళం జిల్లాలోనే ప్రప్రథమంగా ఈ పుస్తక మహోత్సవ వేడుకలు అందరి సహకారంతో నిర్వహిస్తున్నాం. ప్రజలు, రచయితలు, అభిమానులు సందర్శించి విజయవంతం చేయాలి. – కేతవరపు శ్రీనివాస్,
కన్వీనర్, పుస్తక మహోత్సవం
పుస్తకం
పుస్తకం


