ప్రైవేటీకరణ చేస్తే ప్రజాగ్రహమే
● 12వ తేదీ ర్యాలీ విజయవంతం చేయాలి
● వైఎస్సార్‌సీపీ నాయకులు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని చూస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని వైఎస్సార్‌సీపీ కాళింగకుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దుంపల లక్ష్మణరావు అన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తే దాంతో అనుబంధంగా ఉన్న నర్సింగ్, ఫిజియోథెరపి, డెంటల్ వంటి అనేక కోర్సులు చేసేవారంతా తీవ్రంగా నష్టపోతారన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హొటల్‌లో సోమవారం వైఎస్సార్ సీపీ నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు ఎరువులు ఇవ్వలేకపోయిందని, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయలేదని, నిరుద్యోగ భృతి ఇవ్వలేదని లెక్కలతో సహా చెప్పారు. ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేసి రూ 2.20లక్షల కోట్లు అప్పులుచేసి అమరావతి నిర్మాణం తప్ప ఇంకేమీ చేయడం లేదన్నారు. ఈ నెల 12న వైఎస్సార్ సీపీ నిర్వహించనున్న ర్యాలీ విజయవంతం చేయాలని కోరారు.
జిల్లాకో మెడికల్ కాలేజీ జగన్ లక్ష్యం
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఉండాలన్నదే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని పార్టీ తూర్పుకాపు కుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్ అన్నారు. కాలేజీల్లో 50 శాతం సీట్లు ఎన్‌ఆర్‌ఐ, డోనేషన్లకు అమ్ముకుని సొమ్ము సంపాదించాలన్నదే చంద్రబాబు లక్ష్యమన్నారు. పేద ప్రజలన్నా, పేదల ఆరోగ్యం చంద్రబాబుకి అవసరం లేదన్నారు. ప్రైవేటీకరణను సామాన్యుల నుంచి మేధావులంతా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.
పేర్ల మార్పు తప్ప చేసిందేమిటి..?
వైఎస్ జగన్ పెట్టిన పథకాలకు పేర్లు మార్చడం తప్ప చంద్రబాబు ప్రభుత్వం ఇంకేమీ చేయలేదని పార్టీ కళింగవైశ్యకుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు అంధవరపు సూరిబాబు అన్నారు. ప్రజా వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకుని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. శ్రీకాకుళం నగరంలో డే అండ్ నైట్ నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతి పత్రం అందించనున్నట్లు తెలిపారు.
● వైద్య విద్యని సంపన్నవర్గాలకు అందించాలన్నదే చంద్రబాబు ఆలోచన తప్ప పేదలకు కోసం ఏనాడూ ఆలోచన చేసిన సందర్బాలు లేవని పార్టీ వెలమ కుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంబటి శ్రీనివాసరావు అన్నారు. మోసకారి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేపట్టే ర్యాలీ కార్యక్రమానికి భారీగా హాజరు కావాలని పిలుపునిచ్చారు.
● మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే పేదవర్గాలకు వైద్య విద్య అందని ద్రాక్షగా మిగిలిపోతుందని పొందర, కూరాకుల కుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు రాజాపు అప్పన్న అన్నారు. రూ 500కోట్లు ఖర్చుచేస్తే మిగిలిన అన్ని మెడికల్ కాలేజీలు పూర్తవుతాయని అన్నారు.
● ఉద్యోగులకు అనేక హామీలిచ్చి తీరా ఏడాదిన్నర తర్వాత ఒక్క డీఏ ఇచ్చి దాన్ని కూడా ఓ రెండేళ్ల తరువాత పెన్షన్‌లో కలిపి ఇస్తాననడం ఎంతవరకు సబబని శ్రీశయన కుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు డీపీ దేవ్ ప్రశ్నించారు. ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులపై అక్రమంగా కేసులు పెట్టి నోరునొక్కేయాలని చూడటం తగదన్నారు.


