‘కఠోర సాధనే విజయ మార్గం’
వజ్రపుకొత్తూరు రూరల్: ఉన్నత లక్ష్యాలను అధిరోహించాలంటే కఠోర సాధన అవసరమని బ్రహ్మపుత్ర నదిని ఈదిన ప్రపంచ రికార్డు గ్రహీత మేజర్ వాసుపల్లి కవిత అన్నారు. మండలంలో గల మోట్టూరులో ఆదివారం ఆమెను అభ్యుదయ సేవా సంఘం ఆధ్వర్యంలో పలు సంఘాల వారు, గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ చిన్న వయస్సులోనే వైద్య వృత్తిని పూర్తి చేసి భారత సైన్యంలో చేరి ఆర్మీ అధికారిగా నియమితులయ్యారని కొనియాడారు. బ్రహ్మపుత్ర నది ప్రవాహాన్ని రాఫ్ట్ చేసిన తొలి మ హిళగా చరిత్ర సృష్టించారని కొనియాడారు. అలా గే 6,488 మీటర్ల ఎత్తైన మౌంట్ గోరిచెన్ శిఖరాన్ని అధిరోహించమే కాకుండా అత్యంత ప్రతికూల పరిస్థితిలో సహచరుడి ప్రాణాలను కాపాడి విశిష్ట సేవా పథకాన్ని అమె అందుకున్నారని తెలిపారు. కవిత తల్లిదండ్రులైన వాసుపల్లి రామారావు, రమ్యలను కూడా సత్కరించారు. కార్యక్రమంలో అభ్యుదయ సేవా సంఘం అధ్యక్షుడు పి.దిలీప్, కార్యదర్శి కృష్ణారావు, సంఘ పెద్దలు దుర్యోధన, ప్రకాశ్, కె.దుర్గారావు, ఎంపీటీసీలు తిర్రి గుణ, కె.సురేఖ, సర్పంచ్ తిర్రి కామేశ్వరి, ఖండ్లా సంఘ అధ్యక్షులు ప్రకాశ్, సూరాడ మోహన్‌రావు, తిర్రి లక్ష్మీనారాయణ, శేషయ్య, యువకులు, మహిళలు తదితరులు ఉన్నారు.


